నిన్న కళాశాల.. నేడు చెరసాల

21 Dec, 2019 10:33 IST|Sakshi

తెలుగు అధ్యాపకురాలు హరిశాంతి అనుమానాస్పద మృతి కలకలం

నిందితుడు ప్రొఫెసర్‌ నటరాజ్‌ అరెస్ట్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై: నిన్నటి వరకు కళాశాలలో ఓ ప్రొఫెసర్‌గా విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. ప్రస్తుతం ప్రియురాలి అనుమానాస్పద కేసులో అరెస్టయి జైలు పక్షిగా మారిపోయాడు. తెలుగు అధ్యాపకురాలు హరిశాంతి అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి డీజీ వైష్ణవీ కళాశాల ప్రాఫెసర్‌ నటరాజ్‌ను పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.

తిరువళ్లూరు జిల్లా కారంబాక్కం తాలూకా ఎల్ల యమ్మన్‌ ఆలయం వీధికి చెందిన హరిశాంతి (32) ఉన్నత విద్యావంతురాలు. మద్రాసు యూనివర్సిటీ తెలుగు విభాగంలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ పట్టాలు పొందిన హరిశాంతి చెన్నై పెరంబూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగుటీచర్‌గా పనిచేసేవారు. మద్రాసు యూనివర్సిటీలో  తోటి విద్యార్థి నటరాజ్‌తో ఏర్పడిన పరిచయం స్నేహంగా, ఆ తరువాత ప్రేమగా మారినట్లు సమాచారం. పీహెచ్‌డీ పట్టా అందుకున్న తరువాత హరిశాంతి, నటరాజ్‌ ఇద్దరూ చెన్నై అన్నానగర్‌ ఆర్చ్‌ సమీపం, అరుబాక్కంలోని డీజీ వైష్ణవీ కళాశాలలో తెలుగు విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా చేరారు. దీంతో వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగింది.

అయితే 2016లో నటరాజ్‌ మరో యువతిని పెళ్లిచేసుకోగా ఇద్దరు బిడ్డల తండ్రి కూడా అయ్యాడు. ఈ బాధతోనే మరో కారణం చేతనో హరిశాంతి డీజీ వైష్ణవీ కళాశాల ఉద్యోగాన్ని మానివేసి పెరంబూరులోని ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకురాలిగా చేరింది. అయినా తరచూ కళాశాలకు రాకపోకలు సాగిస్తుండేది. యథాప్రకారం ఈ నెల 17న సాయంత్రం డీజీ వైష్ణవీ కళాశాలకు వచ్చిన హరిశాంతి తెలుగుశాఖ గదిలో ఉరివేసుకుని వేలాతుండగా మరుసటి రోజు ఉదయం కళాశాల సిబ్బంది గుర్తించారు. ఆమె చేతి మణికట్టు పదునైన వస్తువుతో కోసినట్లుగా కూడా ఉంది. ఆరుంబాక్కం పోలీసులు ఆమె మృతదేహాన్ని కీల్‌పాక్‌ పోస్టుమార్టానికి పంపారు. ప్రొఫెసర్‌ నటరాజ్‌తో స్నేహం, ప్రేమ విఫలం, ఆత్మహత్యకు దారితీసిన కారణాలను హరిశాంతి తన సెల్‌ఫోన్‌ వాట్సాప్‌లో నమోదు చేసినట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. హరిశాంతిని ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగంపై నటరాజ్‌ను గురువారం రాత్రి అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.  

మరిన్ని వార్తలు