పాక్‌ : దైవదూషణ కేసులో ప్రొఫెసర్‌కు మరణశిక్ష

21 Dec, 2019 17:18 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో ఉన్న దైవ దూషణ చట్టానికి మరొకరు బలయ్యారు. దైవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశాడని ఓ ప్రొఫెసర్‌కు శనివారం కోర్టు మరణ శిక్ష విధించింది. వివరాలు.. 2013లో ప్రొఫెసర్‌ జునైద్‌ హఫీజ్‌ ఖాన్‌ ముల్తాన్‌లోని ఓ యూనివర్సిటీలో ప్రసంగిస్తూ దైవదూషణ వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణపై కేసు దాఖలైంది. అప్పటి నుంచి ప్రొఫెసర్‌ను బయట సమాజంలో ఉంటే ప్రాణాలకు ప్రమాదమంటూ నిర్భందంలో ఉంచి విచారించారు. ఈ నేపథ్యంలో విచారణ పూర్తయి శనివారం తీర్పు వెలువడింది. మరణ శిక్షతో పాటు 5 లక్షల పాకిస్తాన్‌ రూపాయలను కోర్టు జరిమానా విధించింది. ఈ తీర్పుపై ప్రొఫెసర్‌ తరపు న్యాయవాది స్పందిస్తూ.. తన క్లయింట్‌కు చట్టాన్ని తప్పుగా అన్వయిస్తూ దోషిగా తేల్చారని, తీర్పును పైకోర్టులో సవాల్‌ చేస్తామని తెలిపారు. కాగా, పాక్‌లో దైవ దూషణ చట్టాన్ని మైనార్టీలను అణగదొక్కడానికి, వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి ఉపయోగపడుతోందని పలు జాతీయ, అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నాయి.

ఇటీవల ఐక్యరాజ్యసమితి వెలువరించిన నివేదికలో కూడా ఈ చట్టం, గిట్టని వారిపై ప్రయోగించే అస్త్రంగా దుర్వినియోగమవుతుందని వెల్లడించింది. ఇంతకు ముందు 2011లో ఆసియా బీబీ అనే  క్రిస్టియన్‌ మహిళపై ఈ చట్టాన్ని ప్రయోగించారు. అనంతరం అంతర్జాతీయ మీడియా దృష్టి సారించడంతో ఎనిమిదేళ్ల విచారణ అనంతరం ఆమెను ఈ ఏడాది జనవరిలో విడిచిపెట్టారు. విడుదల అనంతరం చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో మే నెలలొ ఆమె కెనడా వెళ్లిపోయింది. ఇది కాక, ఆసియా బీబీ వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడినందుకు పంజాబ్‌ గవర్నర్‌ను అతని బాడీగార్డే కాల్చి చంపాడు. దైవ దూషణ చట్టం ప్రకారం అల్లా, ఇస్లాం, మత ప్రముఖులను కించపరుస్తూ మాట్లాడితే వారికి మరణశిక్ష విధింపబడుతుంది. చదవండి : (పాక్‌ మైనార్టీలపై ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు