ఐదుగురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌

7 May, 2018 02:55 IST|Sakshi
ఎన్‌కౌంటర్‌లో హతమైన మిలిటెంట్‌ సద్దాం పద్దేర్‌ మృతదేహాన్ని ముద్దాడుతున్న యువకుడు

ఇటీవలే హిజ్బుల్‌లో చేరిన ప్రొఫెసర్‌ కూడా మృతి

కశ్మీర్‌లో భద్రతా దళాలతో ఘర్షణల్లో మరణించిన ఐదుగురు పౌరులు

శ్రీనగర్‌: ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు ఆదివారం మట్టుబెట్టాయి. వారిలో ఓ హిజ్బుల్‌ అగ్రనేతతోపాటు ఇటీవలే ఆ సంస్థలో చేరిన విశ్వవిద్యాలయ అధ్యాపకుడు కూడా ఉన్నారు. ఎన్‌కౌంటర్‌ సమయంలో భద్రతా దళాలపైకి రాళ్లు విసిరేందుకు వచ్చిన ఆందోళనకారులు ఐదుగురు మరణించారు. శ్రీనగర్‌లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన 24 గంటల్లోపే ఈ ఎన్‌కౌంటర్‌ జరగడం గమనార్హం. జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లా బదిగాం గ్రామం సమీపంలో తాజా ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరు పోలీసు సిబ్బంది, ఓ ఆర్మీ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు.

బదిగాం గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారాన్ని అందుకున్న భద్రతా దళాలు.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సోదాలు జరుపుతుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారనీ, ఎదురుకాల్పుల్లో ఐదుగురు మరణించారని పోలీసులు తెలిపారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ సద్దాం పద్దేర్, కశ్మీర్‌ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్‌ అధ్యాపకుడిగా పనిచేసే మహ్మద్‌ రఫీ భట్‌తోపాటు తౌసీఫ్‌ షేక్, ఆదిల్‌ మలిక్, బిలాల్‌ అలియాస్‌ మోల్విలు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. భద్రతా దళాలకు, రాళ్లు విసిరేందుకు వచ్చిన ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చెలరేగడంతో పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయనీ, ఆ తర్వాత వైద్యశాలలో చికిత్స పొందుతూ వారిలో ఐదుగురు మరణించారని ఓ అధికారి చెప్పారు.

శుక్రవారం చేరి ఆదివారమే మృత్యు ఒడికి
కశ్మీర్‌ విశ్వవిద్యాలయంలోని సోషియాలజీ విభాగంలో సహాయ అధ్యాపకుడిగా పనిచేసే రఫీ భట్‌ శుక్రవారమే ఇల్లు వదిలిపెట్టి వెళ్లి హిజ్బుల్‌ ముజాహిదీన్‌లో చేరాడు. పోలీసులకు లొంగిపోవాల్సిందిగా అతణ్ని పదేపదే కోరామనీ, అతని కుటుంబ సభ్యుల ద్వారానైనా ఒప్పించాలని వారిని ఎన్‌కౌంటర్‌ స్థలానికి తీసుకొచ్చామని కశ్మీర్‌ ఐజీ ఎస్పీ పనీ చెప్పారు. అయితే కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకునేలోపే భట్‌ భద్రతాదళాల కాల్పుల్లో మరణించాడు. ఆదివారం ఉదయమే భట్‌ తన తండ్రికి ఫోన్‌ చేసి, ‘మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి. నేను అల్లా వద్దకు వెళ్తున్నందున ఇదే నా చివరి ఫోన్‌ కాల్‌’ అని చెప్పాడు.  
 

>
మరిన్ని వార్తలు