అత్తాపూర్‌లో వ్యభిచారం ముఠా గుట్టురట్టు

31 Dec, 2019 11:06 IST|Sakshi

అత్తాపూర్‌: ఓ కాలనీలో గుట్టుగా నిర్వహిస్తున్న వ్యభిచారం దందాను పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటన ఆదివారం రాత్రి రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఈమేరకు ఆరుగురు యువతులతో పాటు ముగ్గురు విటులు, ముగ్గురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాజేంద్రనగర్‌ ఏసీపీ ఆశోకచక్రవర్తి విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన సాయి ఉప్పర్‌పల్లి సన్‌రైజ్‌ కాలనీలో మూడు గదుల ఇంటిని అద్దెకు తీసుకొని 15 రోజుల నుంచి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌ నగరాలకు చెందిన యువతులను తీసుకొచ్చి దందా చేయిస్తున్నాడు. ఈ విషయమై పక్కా సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ, రాజేంద్రనగర్‌ పోలీసులు   ఉప్పర్‌పల్లిలోని వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై దాడి చేశారు. ఆరుగురు యువతులతో పాటు ముగ్గురు విటులు, మరో ముగ్గురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ వ్యభిచార ముఠాను సాయి.. దినేష్‌సింగ్, మణిశర్మతో కలిసి నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చార్మినార్‌ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్‌ఖాన్‌ విటులను పంపిస్తుండేవాడని చెప్పారు. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల నుంచి యువతులను తీసుకువచ్చి నెలకు 25 వేల జీతం, భోజనం, వసతి కల్పిస్తామని మాయమాటలు చెప్పి నిర్వాహకులు వ్యభిచారం నిర్వహించినట్లు తెలిపారు. 2016లో దినేష్‌సింగ్‌పై కేసు నమోదైనా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని ఏసీపీ వివరించారు. గతంలో మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్‌ ప్రాంతాల్లో సైతం ఇలాంటి కార్యకలాపాలు సాగించారని తెలిపారు. ఈమేరకు పూర్తి విచారణ జరుపుతున్నట్లు తెలియజేశారు. యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. నిర్వాహకులు, విటులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ పంపినట్లు వెల్లడించారు. ప్రజలు తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100 నంబర్‌కు కాల్‌ చేసి సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఏసీపీ అశోక చక్రవర్తి తెలిపారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ సురేష్, ఎస్సైలు బాలరాజు, రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా