సైకోనా.. పాత నేరస్తుడా

7 Mar, 2018 10:08 IST|Sakshi
కోవూరు రైల్వేట్రాక్‌ సమీప ప్రాంతానికి సైకో వచ్చాడని గుమికూడిన జనం

భయంతో హడలెత్తుతున్న ప్రజలు

పోలీసులు విస్తృతంగా గాలిస్తున్న వైనం

పుకార్లు నమ్మవద్దంటున్న  పోలీసులు

కోవూరు ప్రజలకు సైకో భయం వీడటం లేదు. అనుమానాస్పదస్థితిలో ఎవరు కనిపించిన సైకో అంటూ హడలెత్తుతున్నారు. అటు వెళ్లాడు.. ఇటు వెళ్లాడంటూ చర్చించుకుంటున్నారు. ఈ సమాచారం పోలీసులకు అందితే  పరుగులు పెడుతున్నారు. కాగా పుకార్లను నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు.

బుచ్చిరెడ్డిపాళెం:  కోవూరులో సైకో కలకలం వీడలేదు. పగలు, రాత్రి తేడా లేకుండా పోలీసులు గాలిస్తున్నా ప్రజల్లో భయం పోలేదు. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున జలదంకి విజయమ్మ, ఒంటేరు అంకమ్మపై సైకోగా చెబుతున్న వ్యక్తి దాడి చేసి గాయపరిచిన విషయం విదితమే. అదే రోజు మరో ముగ్గురిపై దాడి చేయపోగా ప్రతిఘటించడంతో పారిపోయాడు. ఇదంతా దాడి చేసిన వ్యక్తిని కళ్లారా చూసిన వ్యక్తులు చెబుతున్న విషయమే. అయితే మరుసటిరోజు 3వ తేదీన రామాలయం వద్ద బిచ్చగాడిపై జరిగిన దాడిలో దాడి చేసిన వ్యక్తులను ఎవరూ చూడలేదు. ఆ రోజు నుంచి అనుమానంగా ఎవరు కనపడినా ప్రజలు భయపడుతున్నారు. సైకో వచ్చాడంటూ అంటున్నారు. దీంతో అందరూ ఉలిక్కిపడి కంగారు పడుతున్నారు. తాజాగా సోమవారం రాత్రి పడుగుపాడు రైల్వేట్రాక్‌ పక్కన గుడిసెల వద్దకు సైకో వచ్చాడంటూ అక్కడి మహిళలు చెబుతున్నారు. బహిర్భూమికి వచ్చాడని అనుకున్నామని, ఒక్కసారిగా కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించగా భయపడి పరుగులు తీశామని అంటున్నారు. యువకులు స్పందించి పట్టుకునేందుకు ప్రయత్నించగా రాళ్లతో దాడి చేశాడని తెలిపారు. అదే సమయంలో వేగూరులో కూడా సైకో వచ్చాడంటూ కలకలం రేగింది. అయితే పోలీసులు మాత్రం అవన్నీ పుకార్లేనని కొట్టిపారేస్తున్నారు. పుకార్లను నమ్మవద్దని చెబుతున్నారు.

సైకోనా.. దొంగా..
సైకోగా చెబుతున్న వ్యక్తి పాత నేరస్తుడిగా పోలీసులు పరిగణిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన మహిళలపై దాడి చేసింది వాస్తవమేనని, అయితే అతడు పాతనేరస్తుడని అంటున్నారు. గతంలో నెల్లూరు ఇరుగాళమ్మ దేవాలయం వద్ద ఉన్న ఓ వ్యక్తి అక్కడి నుంచి వెంకటేశ్వరపురానికి మకాం మార్చాడు. మద్యం సేవిస్తే చిర్రెత్తి పోయే వ్యక్తి మహిళలపై అత్యాచారానికి ప్రయత్నిస్తాడని సమాచారం. ఈ క్రమంలో 2వ తేదీ మహిళలపై దాడి చేసి గాయపరిచాడని, పోలీసుల దృష్టి పడడంతో పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు మాత్రం సదరు వ్యక్తిని పట్టుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఏ నిమిషమైనా ఆ వ్యక్తిని పట్టుకునే అవకాశం ఉంది. అయితే ఈలోగా ప్రజల్లో ఉన్న భయాందోళనతో కలకలం రేగుతోంది.

త్వరలోనే పట్టుకుంటాం
సైకోగా చెబుతున్న వ్యక్తి పాత నేరస్తుడని అతడ్ని పట్టుకుంటామని సీఐ వెంకటేశ్వర్లురెడ్డి చెబుతున్నారు. గాయపడిన మహిళలను ఇటీవల సన్నపనేని రాజకుమారి పరామర్శించిన విషయం విదితమే. గాయపరచిన వ్యక్తిని త్వరలో పట్టుకోవాలని ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణను ఆమె కోరిన విషయం తెలిసిందే. ఎస్పీ రామకృష్ణ ఇప్పటికే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు విస్తృతం చేశారు. ఈ నేపథ్యంలో త్వరలో గాయపరచిన వ్యక్తిని పట్టుకుంటామని సీఐ చెబుతున్నారు.

మరిన్ని వార్తలు