మహిళలను హతమారుస్తూ.. వీడియో చిత్రీకరణ

1 Feb, 2019 14:00 IST|Sakshi

సెల్‌ఫోన్‌ మెమొరీ కార్డులు భార్యకు అప్పగింత

సైకో కిల్లర్‌ అరెస్ట్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై: అనేక మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, ఆపై వారిని హతమారుస్తూ సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో చిత్రీకరించడం అతడి హాబీ. ఈ దృశ్యాలను భార్యకు చూపించి జాగ్రత్తగా పెట్టడం అలవాటు. ఇలాంటి సైకో కిల్లర్‌ను తమిళనాడు పోలీసులు అరెస్ట్‌చేశారు. పోలీసు విచారణతో ఆలస్యంగా వెలుగుచూసిన వివరాలు ఇలా ఉన్నాయి.

విల్లుపురం జిల్లా సెంజి సమీపం పెరుంపుగై గ్రామానికి చెందిన కుప్పుస్వామి భార్య కుట్టియమ్మాళ్‌ ఈనెల 18వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. కుట్టియమ్మాళ్‌ కుమారుడు కార్తికేయన్‌ అనేకచోట్ల తల్లికోసం గాలిస్తుండగా తమ సమీప బంధువు దేవేంద్రన్‌తో వెళుతుండగా చూసినట్లు కొందరు తెలిపారు. దీంతో దేవేంద్రన్‌ ఇంటికి వెళ్లగా అతడి భార్య గగుర్పాటుకు గురిచేసే అనేక విషయాలు బయటపెట్టింది. ఆ వివరాలు.. అనేక మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, వారిని హతమారుస్తూ సెల్‌ఫోన్‌ వీడియోలో చిత్రీకరించడం దేవేంద్రన్‌కు అలవాటు. భర్త వివాహేతర సంబంధాలతో విసిగిపోయిన భార్య అతడిని విడిచిపెట్టి పుట్టింటికి చేరింది. భార్యకు నచ్చజెప్పేందుకు దేవేంద్రన్‌ తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న సుమతి అనే మహిళను ఏడాది క్రితం హతమార్చి ఆ వీడియోను భార్యకు చూపించి ఇక ఇలాంటి పనులు చేయనని మాటిచ్చి తిరిగి తనతో తెచ్చుకున్నాడు.

ఈ దశలో కుట్టియమ్మాళ్‌తో కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు అతని భార్యకు తెలియడంతో అలిగి మరలా పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కుట్టియమ్మాళ్‌ను మాయమాటలతో కొండపైకి తీసుకెళ్లి ఆమె మెడలోని తాళిబొట్టు తాడుతో హత్యచేస్తూ వీడియో చిత్రీకరించాడు. ఆమె చనిపోయినట్లు నిర్ధారించుకున్న తరువాత కొండపై నుంచి తోసేశాడు. ఇలా తన భర్త ఎందరో మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని హత్యచేసిన దృశ్యాలు కలిగిన సెల్‌ఫోన్‌ మెమొరీ కార్డులు తన వద్ద భద్రం చేసి ఉన్నాడని కార్తికుయన్‌కు తెలిపింది. దేవేంద్రన్‌ ఇచ్చిన సమాచారంతో పోలీసులు కొండల్లో గాలించి గత నెల 24వ తేదీన కుళ్లిపోయిన స్థితిలో పడిఉన్న కుట్టియమ్మాళ్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానంపై 29వ తేదీన అరెస్ట్‌ చేయడంతో దేవేంద్రన్‌ జైల్లో ఉన్నాడు. అతడి భార్య ఇచ్చిన సమాచారంతో దేవేంద్రన్‌ను పోలీస్‌ కస్టడీకి తీసుకుని ఇతర మహిళల హత్యల గురించి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే భర్త చేసిన హత్యలను దాచిపెట్టిన నేరంపై అతడి భార్యను సైతం అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు