ఔను.. చంపింది నేనే

20 Mar, 2018 09:53 IST|Sakshi
సీరియల్‌ సైకో కిల్లర్‌ మునస్వామి

హత్య చేసిన తీరును వివరించిన.. సీరియల్‌ సైకో కిల్లర్‌  

నేడు మీడియా ఎదుటకు నిందితుడు మునస్వామి

చిత్తూరు అర్బన్‌: ‘ఔను.. జిల్లాలో రెండు హత్యలు, తమిళనాడులో ఆరు మర్డర్లు, ఎనిమిది హత్యాయత్నాలు చేశాను. పాలసముద్రంలో వళ్లియమ్మను ఇంటి వద్ద బండరాయితో చంపాను. దానికి ముందే నగరిలో రత్నమ్మను చంపేశాను’’ అని పోలీసుల అదుపులో ఉన్న సీరియల్‌ సైకో కిల్లర్‌ మునస్వామి పూస గుచ్చినట్లు వివరించాడు. చిత్తూరు పోలీసులు అతన్ని మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. సోమవారం పాలసముద్రం, నగరి ప్రాంతాలకు తీసుకెళ్లారు. అతడు హత్య చేసిన తీరును కళ్లకుకట్టినట్లు పోలీసులకు వివరించాడు. ఇక తమిళనాడులోని షోలింగర్, బానావరం పోలీస్‌ స్టేషన్ల నుంచి సీఐలు చిత్తూరు చేరుకుని మునస్వామి నేర చరిత్రపై వివరాలను సేకరించారు.

తమిళనాడులో ఎక్కడెక్కడ ఎప్పుడు ఎవర్ని చంపాడనే వివరాలను మునస్వామి వివరించాడు. అలాగే పదుల సంఖ్యలో చోరీలు, దొమ్మీల కేసుల్లో సైతం ఈ నరరూప రాక్షసుడి పాత్రను పోలీసులు గుర్తించారు. రూ.50ల కోసం హత్యలు చేయడం, అన్ని హత్యల్లోనూ 60కు పైబడ్డ వయస్సున్న వృద్ధుల్ని ఎంచుకోవడం, తలపై బండరాయి వేసి చంపడం, మృతుల శరీరంపై ఉన్న నగలు ముట్టుకోకపోవడం, చంపిన తరువాత మృతదేహాల లైంగిక అవయవాలను పళ్లతో కొరికి గాట్లు పెట్టడం ఈ సైకో కిల్లర్‌ నైజంగా పోలీసులు గుర్తించారు. మునస్వామి వాంగ్మూలాన్ని రికార్డుల్లో నమోదు చేశారు. మంగళవారం నిందితుడ్ని మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు.

మరిన్ని వార్తలు