పరువు హత్యపై ఆగ్రహం

30 Jun, 2019 04:51 IST|Sakshi
ఆందోళన చేస్తున్న ప్రజా, దళిత సంఘాల నేతలు, బాధితులు, హేమావతి మృతదేహం

భగ్గుమన్న ప్రజా, దళిత సంఘాలు

మృతదేహంతో ఆందోళనకు దిగిన బాధితులు

ఊసరపెంటలో టెన్షన్‌ టెన్షన్‌ 

పలమనేరు (చిత్తూరు): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరువు హత్య ఉదంతంపై ప్రజా, దళిత సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను వెంటనే అరెస్టు చేయాలంటూ ఆందోళనలు చేశాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని ఊసరపెంట గ్రామంలో కులాంతర వివాహం చేసుకుందనే కసితో పచ్చి బాలింత అన్న కనికరం లేకుండా కన్నకూతురినే కుటుంబం అంతా కలసి కిరాతకంగా చంపేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దళిత, ప్రజా సంఘాల నేతలు శనివారం పలమనేరు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. రాష్ట్రంలో దళితులపై అగ్రవర్ణాలు సాగిస్తున్న మారణహోమాన్ని రూపుమాపాలని, పరువు హత్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

నిందితులను అరెస్టు చేసేదాకా అంత్యక్రియలు నిర్వహించమంటూ బాధితులు, బంధువులు భీష్మించుకున్నారు. వారితో పోలీసులు జరిపిన మంతనాలు ఫలించలేదు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కలెక్టర్‌ నారాయణ గుప్త ఆదేశాలతో మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ చేకూరి కీర్తి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల డిమాండ్లను విని వారికి ప్రభుత్వం ద్వారా రూ. 5 లక్షల పరిహారం, భర్త కేశవకు ఔట్‌సోర్సింగ్‌ ద్వారా ఉపాధి, నిందితులను వెంటనే అరెస్టు చేసి కేసును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన బాధితులు హేమావతికి అంత్యక్రియలు పూర్తి చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  పలమనేరు డీఎస్పీ యుగంధర్‌బాబు, స్థానిక సీఐ ఈద్రుబాష, సత్యవేడు, మదనపల్లి సీఐలు రాజేంద్రప్రసాద్, మురళీకృష్ణ తదితరులు చర్యలు తీసుకున్నారు. 

కేసులో కీలకంగా మారిన వీడియో రికార్డింగ్‌ 
పరువు హత్య కేసులో బాధితుని బంధువులు పోలీసులకు పంపిన వీడియో ఇప్పుడు కీలకంగా మారింది. సంఘటన జరిగిన రోజు హేమావతి, ఆమె భర్త కేశవులు వారి వారం రోజుల పసిబిడ్డతో కలసి దొమ్మరిపాపమ్మ ఆలయం వద్ద బస్సు దిగారు. అప్పటికే అక్కడ ఉన్న హేమలత తల్లిదండ్రులు భాస్కర్‌ నాయుడు, వరలక్ష్మి, సోదరులు భానుప్రకాష్, చరణ్, సోదరి నిఖిలలు ఒక్కసారిగా వారివద్దకొచ్చి హేమలతను బలవంతంగా బైక్‌పైకి ఎక్కించుకున్నారు. వారిని అడ్డుకునేందుకు భర్త ప్రయత్నించగా దౌర్జన్యం చేశారు. అక్కడే ఉన్న కేశవులు మామ తన మొబైల్‌లో జరుగుతున్న తంతును వీడియో తీసి స్థానిక పోలీసులకు వాట్సాప్‌ ద్వారా పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొనే లోపే హత్య జరిగిపోయింది. ఈ కేసులో హతురాలి తల్లి, సోదరి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండగా తండ్రి, సోదరులు పరారీలో ఉన్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసేందుకు అన్ని కోణాల్లో ప్రయత్నిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు