జిగ్నేష్‌కు డబుల్‌ షాక్‌

4 Jan, 2018 11:55 IST|Sakshi

సాక్షి, ముంబై : అల్లర్లు.. బంద్‌ తర్వాత మాములు పరిస్థితులు కనిపిస్తున్న వేళ దళిత నేత, గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేష్‌ మెవానీకి మహారాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఝలకే ఇచ్చింది. గురువారం ఆయన పాల్గొనాల్సిన ఓ సదస్సును పోలీసులు అడ్డుకున్నారు . ఈ మేరకు విలే పార్లేలోని భాయ్‌ దాస్‌ హాల్‌ ఆడిటోరియంను పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు.. అక్కడి నుంచి విద్యార్థులను బలవంతంగా బయటకు పంపివేస్తున్నారు. 

కార్యక్రమం రద్దైన విషయాన్ని నిర్వాహకుడు, ఛత్ర భారతి ఉపాధ్యక్షుడు సాగర్‌ భాలేరావ్‌ ప్రకటించారు. అఖిల భారత విద్యార్థుల సదస్సు కార్యక్రమానికి జిగ్నేష్‌తోపాటు జేఎన్‌యూ నేత ఉమర్‌ ఖలీద్‌ కూడా హాజరు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమం కోసం చాలా రోజుల క్రితమే అనుమతి తీసుకున్నప్పటికీ.. పోలీసులు ఇప్పుడు హఠాత్తుగా అడ్డుకోవటం ఆశ్చర్యంగా ఉందని సాగర్‌ చెబుతున్నారు.  

ప్రస్తుతం ఆడిటోరియం చుట్టుపక్కల ప్రాంతంలో 149 సెక్షన్‌ విధించిన పోలీసులు.. పలువురు విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

జిగ్నేష్‌ కి వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్‌

ఇదిలా ఉంటే జిగ్నేష్‌ రెచ్చగొట్టే ప్రసంగం మూలంగానే ఈ అల్లర్లు చోటు చేసుకున్నట్లు ఓ ఫిర్యాదు అందంటంతో పుణే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎఫ్‌ఐఆర్‌లో జిగ్నేష్‌, ఉమర్‌ ఖలీద్‌ పేర్లను కూడా చేర్చినట్లు విశ్వరమ్‌ బాగ్‌ పోలీసులు వెల్లడించారు. భీమ-కోరేగావ్‌ యుద్ధ 200వ వారికోత్సవం సందర్భంగా షనివార్‌ వాదా వద్ద డిసెంబర్‌31న ఎల్గర్‌ పరిషత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో జిగ్నేష్‌ ప్రసంగిస్తూ.. దళితులంతా రోడ్ల మీదకు వచ్చి పోరాడాలని పిలుపునివ్వటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లర్లు చెలరేగాయని ఫిర్యాదులో అక్షయ్‌ బిక్కద్‌, ఆనంద్‌ ధోంద్‌ పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు