తుపాకీతో కాల్చుకుని ప్రేమజంట బలవన్మరణం

6 Sep, 2019 08:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చండీగఢ్‌ : జీవితంపై విరక్తి చెందిన ప్రేమికులు అర్ధాంతరంగా తనువు చాలించారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని పేర్కొంటూ సోషల్‌ మీడియాలో వీడియో అప్‌లోడ్‌ చేసి.. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదరకర ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.... రాష్ట్రంలోని గుజ్రాన్‌ గ్రామానికి చెందిన సిక్కు యువకుడు(25), దళిత యువతి(20) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అతడు ఇంటర్ పాసై పొలం పనులు చూసుకుంటుండగా..యువతి ప్రస్తుతం బీఏ ఫైనలియర్‌ చదువుతోంది. చాలా ఏళ్లుగా వీరు ప్రేమలో ఉన్నప్పటికీ ఆ విషయం పెద్దలకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఈ క్రమంలో గురువారం ఇద్దరూ కలిసి యువకుడికి చెందిన పొలానికి వెళ్లారు.

అనంతరం తాము ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డామని పేర్కొంటూ వాట్సాప్‌లో తమ స్నేహితులకు వీడియో పంపించారు. ‘ మేము ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. దయచేసి నా కుటుంబ సభ్యులు, స్నేహితులను ఈ విషయమై ఇబ్బంది పెట్టకూడదని పోలీసులను కోరుతున్నా. నేను నా వాళ్లను చాలా కష్టపెట్టాను. అందుకు క్షమాపణలు చెబుతున్నా. మీరందరూ అంటే నాకెంతో ఇష్టం. భయంతో చచ్చిపోతున్నా అని నా ప్రత్యర్థులు భావించవచ్చు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల విధిలేని పరిస్థితుల్లో ప్రాణాలు తీసుకుంటున్నా’ అని సదరు యువకుడు వీడియోలో పేర్కొన్నాడు. ఆ తర్వాత తుపాకీతో యువతి పొట్టలో కాల్చి, తాను రెండుసార్లు మెడపై కాల్చుకుని కుప్పకూలాడు.

కాగా ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్ట్‌ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల వద్ద వాంగ్మూలం తీసుకుని దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. యువతి కొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతుందని..ఈ కారణంగానే ప్రేమజంట ఆత్మహత్య చేసుకుని ఉంటుందన్న స్థానికుల వివరాల మేరకు విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు