పాక్ కుట్రను తిప్పికొట్టిన భారత్!

30 Mar, 2018 11:50 IST|Sakshi

సాక్షి, అమృత్‌సర్: పాకిస్తాన్‌ కుటిల బుద్ధి మరోసారి బయటపడింది. డబ్బు ఆశ చూపి భారత యువతను గూఢచారులుగా నియమించుకుంటుంది. భారత నిఘా వ్యవస్థను అస్థిర పరచడానికి పాక్‌ చేస్తోన్న ఈ ప్రయత్నాలను భారత అధికారులు సమర్ధవంతంగా తిప్పికొట్టారు. పాక్‌ నిఘా వ్యవస్థ ఐఎస్‌ఐకి గూఢచారిగా వ్యవహరిస్తున్న అమృత్‌సర్‌కి చెందిన రవి కుమార్‌ని మిలటరీ ఇంటెలిజెన్స్‌ అధికారుల సహాయంతో పంజాబ్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏడు నెలల క్రితమే అతన్ని ఫేస్‌బుక్‌ ద్వారా ఐఎస్‌ఐ రిక్రూట్‌ చేసుకున్నట్లు సమాచారం. 

పంజాబ్‌లోని ముఖ్యమైన సంస్థలు, నిషేధిత ప్రాంతాలు, దేశ సరిహద్దు ప్రాంతాల్లో ఆర్మీ కదలికలు, కొత్త బంకర్లకు సంబంధించిన సమాచారాన్ని అతడు పాక్‌కి చేరవేస్తున్నాడు. ఇంటర్నెట్‌ ద్వారా ఫొటోలు, ఎస్‌ఎంఎస్‌లు పంపుతూ నిరంతరం పాక్‌ ఐఎస్‌ఐతో టచ్‌లో ఉంటున్నాడు. ఇందుకు ప్రతిఫలంగా ఐఎస్‌ఐ ఎజెంట్లు దుబాయ్‌ నుంచి రవి అకౌంట్‌కి డబ్బును పంపిస్తున్నారు. ఫిబ్రవరి 20 నుంచి 24 వరకు రవి దుబాయ్‌లో గడిపాడని అక్కడే ఈ ఆపరేషన్‌కు సంబంధించిన అంశాలను అతడికి వివరించినట్టు తెలుస్తోంది.

రవి కుమార్‌పై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఇంకా అతడికి ఏయే గ్రూపులతో, ఎవరితో సంబంధాలున్నాయో తెలుసుకోవడానికి దర్యాప్తు తీవ్రతరం చేసినట్లు తెలిపారు. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్ర సంస్థలు అమ్మాయిల పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాల ద్వారా ఉగ్రవాదంపై ప్రేరేపిస్తున్నాయని, చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు యువతను హెచ్చరించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా