టాస్క్‌ఫోర్స్‌ పోలీసులమని పెప్పర్ స్ప్రేతో దాడి: సీపీ

6 Jan, 2020 14:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పి పెప్పర్ స్ప్రే తో పెట్రోలింగ్ సిబ్బంది పై దాడి చేసిన దొంగల ముఠాను పోలీసులు చేధించారు. రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారి వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు వర్ధన్‌ మనికందన్‌గా..అతనిది తమిళనాడుగా గుర్తించామన్నారు. ఘటన అనంతరం నిందితుడు వర్ధన్ మనికందన్ పరారయ్యాడని.. సీసీ ఫుటేజీ ద్వారా విచారణ చేపట్టగా  వర్ధన్ మనికందన్‌తో పాటు పిల్లా యాదయ్య, షేక్ సయ్యద్, ఉపేంద్ర చారీ, లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుల‌ నుంచి 47.5 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి‌ ఆభరణాలు, 1ఎయిర్ పిస్తోల్, 2పెప్పర్ స్ర్పే బాటిల్స్, 3బైకులు, 3టీవీలు, 1పియానో, చోరీకి పాల్పడే వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 

2017 నుంచి మనికందన్ గ్యాంగ్ చోరీలు చేస్తున్నారని, వీరిపై పలు పోలీస్‌ స్టేషన్లలో 27 కేసులున్నాయని వెల్లడించారు. ఉప్పల్, తుర్కపల్లి, ఎల్బీనగర్, మీర్ పేట్, వనస్థలి పురం, హయత్ నగర్ పీఎస్ లలో కేసులు ఉన్నాయన్నారు. సికింద్రాబాద్‌కు చెందిన మల్లేష్ తో మనికందన్ గ్యాంగ్ చేతులు కలిపి గుప్తనిధుల కోసం కూడా తవ్వకాలు జరిపినట్లు సమాచారం ఉందని తెలిపారు. వీరిపై నల్గొండ జిల్లా దేవరకొండ పీఎస్‌లో కేసు నమోదైందని, నిందితుల గాలింపులో తమిళనాడు పోలీసులు చాలా సహకారం అందించారని పేర్కొన్నారు. అనంతరం ఈ కేసులో నిందితులను పట్టుకున్న పోలీసులకు సీపీ రివార్డులు అందించారు. 
 
అదే విధంగా జవహర్ నగర్‌లో జరిగిన చోరీపై సీపీ మహేష్ భగవత్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా డిసెంబర్ 31 రోజున జరిగిన చోరీ కేసును చేధించామని ఆయన తెలిపారు. ఘటనా స్థలంలో దొరికిన వేలి ముద్రల ఆధారంగా తునా సంజయ్ సింగ్ అలియాస్‌ టమాటో సంజయ్, మనీష్ ఉపాధ్యాయ, ప్రదీప్ శ్యామ్‌లను అరెస్టు చేశామన్నారు. నిందితులది మేడ్చల్ జిల్లాగా.. నిందితుల నుంచి 66 తులాల బంగారం, 3.74 కేజీల వెండి ఆభరణాలు, రూ. 5,650 నగదు, ఒక డెల్ ల్యాప్‌టాప్, సోనీ హ్యండ్ కెమెరా, ఒక హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడి తునా సంజయ్ సింగ్ పై 8 కేసులు నమోదయ్యయని, నేరెడ్ మెట్, బేగంపేట, చిలకలగూడ పోలీస్ స్టేషన పరిధిలో కేసులున్నాయన్నారు. మనీష్ పై గతంలో ఆరు కేసులు ఉన్నాయని, సంజయ్ సింగ్ గతంలో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చి మళ్ళి చోరీలకు పాల్పడుతున్నాడని తెలిపారు. కేసును చేధించడంలో చురుగ్గా స్పందించి నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన వేలిముద్రల బృందానికి, పోలీసులకు రాచకొండ సీపీ మహేష్ భగవత్ రివార్డులు అందించారు.

మరిన్ని వార్తలు