కేసు ఛేదన: ‘28 కిలోల బంగారం.. 63 కిలోల వెండి’

19 Jun, 2020 17:54 IST|Sakshi

దొంగతనం కేసును ఛేదించిన రాచకొండ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: నగల దుకాణంలో దొంగతనానికి పాల్పడిన ముఠాను రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నేరేడ్‌మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశవ్ నగర్‌లో ఉన్న ధనలక్ష్మి జువెలరీ షాప్‌లో ఈ నెల 11 న భారీ చోరీ జరిగింది. దాదాపు పావు కిలో బంగారం, 75 కిలోల వెండి దొంగిలించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాచకొండ పోలీసులు ఎనిమిది రోజుల్లోనే ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 28 తులాల బంగారం, అరవై మూడు కిలోల వెండి, ఒక ట్రాలీ ఆటో, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. 
(చదవండి: భార్యను బ్లాక్‌మెయిల్‌.. రూ.కోటి వసూలు!)

వీటి విలువ సుమారు రూ.47 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులంతా రాజస్థాన్ చెందినవారే కావడం గమనార్హం. దొంగతనం జరిగిన ధనలక్ష్మి నగల దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేసే పప్పు రామ్ దేవాసి ప్రధాన నిందితుడిగా కమిషనర్‌ మహేష్ భగవత్ తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు స్నేహితులతో కలిసి తాను పనిచేసే దుకాణానికి పప్పు రామ్‌ కన్నం వేసాడని చెప్పారు. నిందితుడు పప్పు రామ్ తాను పనిచేసే దుకాణం పైనే నివాసం ఉండేవాడు. దుకాణ యజమానికి అనుమానం రాకుండా నమ్మకంగా ప్రవర్తిస్తూ అతని స్నేహితులతో కలిసి చోరీకి పాల్పడ్డాడు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని కమిషనర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు