పోలీసుల కస్టడీకి శ్రీనివాస్‌ రెడ్డి

8 May, 2019 10:50 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: రాష్ట్రవ‍్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్‌ నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. వరంగల్‌ సెంట్రల్‌ జైల్లో ఉన్న అతడిని బుధవారం ఉదయం రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణాధికారిగా భువనగిరి ఏసీపీ భుజంగరావును రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ నియమించిన విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో శ్రీనివాస్‌రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. కేసును లోతుగా విచారించేందుకు నిందితుడిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్‌ వేశారు. దీంతో నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శశిధర్‌రెడ్డి ఈ నెల 8 నుంచి 13 వరకు విచారణ కోసం పోలీస్‌ కస్టడీకీ అను మతి ఇచ్చారు. ఆ సమయంలో పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని ఏ విధమైన శారీరక, మానసిక హింసకు గురి చేయరాదని ఉత్తర్వులో పేర్కొన్నారు. 

నేర చరిత్రపై కొనసాగనున్న విచారణ.. 
క్రూరమైన హత్యలకు పాల్పడిన శ్రీనివాస్‌రెడ్డి నేర చరిత్రపై పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నాయి. నిందితుడి స్వగ్రామం హాజీపూర్, బొమ్మలరామాం, హైదరాబాద్, వేములవాడ, కరీంనగర్, కర్నూలు ఇతర ప్రాంతాల్లో జరిగిన మిస్సింగ్‌ కేసులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారించే అవకాశాలు ఉన్నాయి. నాలుగేళ్లుగా రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్‌ కేసుల వివరాలు తెప్పించుకున్న పోలీసులు వాటితో శ్రీనివాస్‌ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారించనున్నారు. 

ఫేస్‌బుక్‌ స్నేహితులపై ఆరా...
శ్రీనివాస్‌రెడ్డికి ఉన్న ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోని స్నేహితుల వివరాలపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అతడి నేర ప్రవృత్తికి ఎవరైనా బలైపోయారా అన్న కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. కాగా శ్రీనివాస్‌ రెడ్డి ఫేస్‌బుక్‌ ఖాతాలో ఎక్కువమంది మహిళలకు సంబంధించిన స్నేహితులే ఉన్నారు. కస్టడీ విచారణలో ఫేస్‌బుక్‌ పరిచయాలు, వారిందరితో గల సంబంధాలు వారి ప్రస్తుత పరిస్థితిని విచారణలో అధ్యయనం చేయనున్నారు. 

మరిన్ని వార్తలు