భారీ చోరీ కేసును ఛేదించిన రైల్వే పోలీసులు

9 Jul, 2020 14:08 IST|Sakshi
నిందితుల అరెస్ట్‌తోపాటు స్వాధీనం చేసుకున్న నగదు, బంగారు ఆభరణాలు చూపుతున్న రైల్వే డీఎస్‌పీ రమేష్‌బాబు

రూ.18.5లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం

ఇద్దరు తమిళనాడు నిందితుల అరెస్ట్‌

రేణిగుంట:  వైఎస్సార్‌ జిల్లాకు చెందిన బంగారు నగల వ్యాపారి నగదు బ్యాగు చోరీ కేసును ఛేదించి రూ.23లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే డీఎస్పీ రమేష్‌బాబు వెల్లడించారు. స్థానిక రైల్వేస్టేషన్‌ జీఆర్‌పీ స్టేషన్లో బుధవారం విలేకరులకు రైల్వే డీఎస్పీ తెలిపిన వివరాలు...వైఎస్సార్‌ జిల్లా శంకరాపురానికి చెందిన నగల వ్యాపారి రేవూరి చౌడయ్య చెన్నైలో ఆభరణాలను కొనేందుకు రూ.61.5లక్షలను బ్యాగులో ఉంచుకుని గరుడాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలులో వెళుతుండగా పుత్తూరు స్టేషన్‌ వద్ద ఈ బ్యాగు చోరీకి గురైంది. ఈ సంఘటన గత ఏడాది అక్టోబర్‌ 30న చోటుచేసుకుంది. అప్పట్లో బాధితుని ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. రైల్వే డీజీపీ ద్వారకా తిరుమల, ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను నియమించి నిందితుల కోసం గాలించారు. కీలకమైన క్లూలు లభించడంతో ఎస్‌ఐలు అనిల్‌కుమార్, రారాజు, ప్రవీణ్‌కుమార్‌తో కూడిన సిబ్బంది ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పొన్నేరి తాలూకా కృష్ణాపురం మెట్టు కాలనీకి చెందిన రాజేంద్రన్‌ అలియాస్‌ ఇదయరాజ(26), ఊతుకోటై మండలం సీతంజెరికి చెందిన సుబ్రమణి అలియాస్‌ బాటిల్‌ మణి(30)ను అరెస్ట్‌ చేశారు.

వారి నుంచి రూ.18.5లక్షల నగదు, 38 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కిలో వెండి ఆభరణాలు, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్‌ మెషిన్, హోం థియేటర్‌తో సహా మొత్తం రూ.23లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు ఆంటోనీని త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని, నిందితులను నెల్లూరు రైల్వే కోర్టులో హాజరు పరచనున్నట్లు  రైల్వే డీఎస్పీ చెప్పారు. కేసు ఛేదనకు కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు.  

మరిన్ని వార్తలు