ఆత్మహత్యలకు కేరాఫ్‌గా.. రైల్వేట్రాక్స్‌

28 Aug, 2019 09:14 IST|Sakshi

క్షణికావేశంతో రైళ్ల కిందపడి అఘాయిత్యాలు

మూడేళ్లలో ఉమ్మడి జిల్లాలో 166మంది బలవన్మరణం

మృతుల్లో యువకులే అధికం

సాక్షి, నల్లగొండ/ భువనగిరి: ప్రేమ విఫలమైందని.. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని.. ఆరోగ్య సమస్యలు కుదుటపడడం లేదని.. సంతాన భాగ్యం కలగలేదని.. ఉద్యోగం రావడం లేదనే ఆత్మన్యూనతా భావంతో ఎందరో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు.  కారణాలు ఏమైతేనేం క్షణికావేశంలో తమ నిండు ప్రాణాలను చేజేతులా బలితీసుకుంటున్నారు. అందుకు రైల్వేట్రాక్‌లు కేరాఫ్‌లుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన మూడేళ్ల కాలంలో ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైళ్ల కిందపడి  166మంది అఘాయిత్యాలకు ఒడిగట్టారని రైల్వేపోలీసుల రికార్డులు పేర్కొంటున్నాయి. 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొందరు క్షణికావేశంలో రైలు పట్టాలను కేరాఫ్‌గా మార్చుకుని అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. అయితే ఇందులో ఎక్కువగా యువకులే ఉండడం కలవరానికి గురిచేస్తోంది.  క్షణికావేశంలో వెంటనే తీసుకుని సమీపంలో ఉన్న రైలు పట్టాలపైకి వచ్చి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కొందరు, అనారోగ్యంతో మరికొందరు, వివాహేతర సంబంధాలతో మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు.  ప్రతినెలా 6 నుంచి 8 మంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రైల్వేపోలీస్‌ రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి. మృతుల్లో అధికమంది 20 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎదిగివచ్చిన పిల్లలు  ఆత్మహత్యకు పాల్పడడంతో  వారి తల్లిదండ్రులు మానసికంగా కుంగిపోతున్నారు.  

అధికంగా ఎక్కడెక్కడంటే..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీబీనగర్, మిర్యాలగూడ, నల్లగొండ రైల్వేస్టేషన్ల పరిధిలో అధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లా రైల్వే లైన్‌ పగిడిపల్లి నుంచి విష్ణుపురం వరకు 134.5 కిలోమీటర్లు, బీబీ నగర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ఆలేరు వరకు 45 కిలోమీటర్ల రైలు మార్గం ఉంది. నల్లగొండకు అప్‌ అండ్‌ డౌన్‌ 32రైళ్లు, భువనగిరి–ఆలేరు మధ్య 37 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.  

నార్కట్‌పల్లి మండలం తొండ్లాయి గ్రామానికి చెందిన వ్యక్తితో భారతికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక్కగానొక్క కుమారుడు సంతానం. తండ్రి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సాఫీగా సాగిపోతున్న తరుణంలో అనారోగ్య కారణాలతో ఆ కుటుంబం ఇంటిపెద్దను కోల్పోయింది. అప్పటినుంచి కుటుంబ భారం భారతిపై పడింది. తాను నార్కట్‌పల్లిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో పనిచేస్తూ బతుకుబండిని లాగిస్తోంది. అయితే డిగ్రీ చదువుతున్న భారతి కుమారుడు తాను ఓ అమ్మాయిని ప్రేమించాడు. అతడి ప్రేమను ఆ యువతి తిరస్కరించడంతో గత ఏడాది అక్టోబర్‌లో సీతారాంపురం వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఆత్మన్యూనతతో..
అధికంగా నల్లగొండ–రాయినిగూడెం, మిర్యాలగూడ–కొండ్రపోలు , బీబీనగర్‌–వంగపల్లి మధ్య, బీబీనగర్‌ పగిడిపల్లి మధ్య ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీస్‌ రికార్డుల పరిశీలనలో తేలింది. క్షణికావేశం, ప్రేమవిఫలం, ఉద్యోగాలులేవని అనేక రకాలుగా కలత చెందిన యువత ఆత్మన్యూనతా భావానికి లోనై ఆత్మహత్యే శరణ్యంగా భావిస్తూ అఘాయిత్యానికి ఒడిగడుతున్నారని రైల్వేపోలీసుల వర్గాలు పేర్కొంటున్నాయి.

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

 పిట్టల నర్సింహ మృతదేహం

భువనగిరి అర్బన్‌: రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భువనగిరిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని తారకరామానగర్‌కు చెందిన పిట్టల నర్సింహ(41) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సోమవారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. భువనగిరి–పగిడిపల్లి రైల్వేస్టేషన్‌ల మధ్య ఉన్న కిలోమీటర్‌ నంబర్‌ 245/11–13 వద్ద సికింద్రాబాద్‌ నుంచి వరంగల్‌ వైపునకు వెళ్లే గుర్తుతెలియని రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం స్థానికులు గమనించి వెంటనే స్టేషన్‌ మాస్టర్‌కు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న రైల్వేపోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి వివరాలను సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ టి.అచ్చుతం తెలిపారు.

దంపతుల బలవన్మరణం
     ఆర్థిక ఇబ్బందులా..? సంతానం లేకనా..?

నల్లగొండ క్రైం: పట్టణంలోని పాతబస్తీలోని మాల్‌బౌలికి చెందిన ఆటో డ్రైవర్‌ మురారిశెట్టి నగేశ్‌(36), భార్య చరిత(21) సోమవారం రాత్రి 9గంటలకు విజయవాడ నుంచి సికిం ద్రాబాద్‌ వైపు వెళ్తున్న అమరావతి ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులా.. పిల్లలు లేరన్న కారణమా అన్నది తెలియరాలేదు. రైల్వే ఎస్సై అచ్యుత్‌ రామ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆటో డ్రైవర్‌గా జీవనంసాగిస్తున్న నగేశ్, భా ర్య చరితలు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా రైలుకు అడ్డంగా వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు.

రైలు ఎయిర్‌ పైప్‌కు అడ్డంగా మృతదేహాలు ఇరుక్కుపోవడంతో అర కిలోమీటర్‌ దూరం ఈ డ్చుకెళ్లింది. ఈ సంఘటనతో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ 8నిమిషాలు ఆగింది. ఎయిర్‌ పైప్‌కు అడ్డంగా ఉన్న మృతదేహం అవయవాలను తొలగించారు. ఆ తర్వాతనే రైలు సికింద్రాబాద్‌ వైపు నకు వెళ్లింది. లోకో పైలెట్‌ నల్లగొండ రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ రవికుమార్‌కు సమాచా రం అందించారు. వెంటనే ఆయన పోలీసుల కు సమాచారం ఇవ్వడంతో మృతదేహాల అవయవాలను మంగళవారం మార్చురీకి తరలిం చి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. నగేష్‌ దంపతులు ఆర్థిక ఇబ్బందులతోపాటు సంతానం లేదని మదన పడుతుండేవారని స్థానికులు చెబుతున్నారు. ఆరేళ్ల క్రితం నగేశ్‌తో చరితకు వివాహమైంది. వీరి స్వగ్రామం హాలియా మండలం యాచారం. అక్కడినుంచి వచ్చి నల్లగొండలో స్థిరపడ్డాడు. 

 క్షణికావేశంలోనే.. 
క్షణికావేశంలోనే యువకులు ఆత్మహత్యే శరణ్యంగా భావించి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ప్రాణాలు తీసుకునేందుకు అకస్మాత్తుగా రైలు పట్టాలపైకి వస్తున్నారు. రైలు తాకిడికి వారి శరీరం గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమైపోతుండడంతో వాటిని తొలగించేందుకు మనస్సు గగుర్పొడుస్తుంది. అన్నం కూడా తినలేకపోతున్నాం. కుటుంబ సంబంధాలు కలిగి ఉండడం ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చు. 
– రైల్వే ఎస్సై, అచ్యుత్‌రామ్‌

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా