‘లాడెన్‌’.. దొరికెన్‌!

14 Feb, 2020 09:36 IST|Sakshi

సిటీలో చిక్కిన రాజస్థాన్‌ గ్యాంగ్‌స్టర్‌ విక్రమ్‌ గుజ్జర్‌  

బీఎస్పీ నేత హత్య సహా 22 కేసుల్లో నిందితుడు

నవంబర్‌ నుంచి పశ్చిమ మండల పరిధిలో మకాం

చాకచక్యంగా పట్టుకుని తీసుకువెళ్లిన ప్రత్యేక బృందం

సాక్షి, సిటీబ్యూరో: రాజస్థాన్‌కు చెందిన బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) నేత జైస్రామ్‌ గుజ్జర్‌ హత్య సహా 22 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆ రాష్ట్ర గ్యాంగ్‌స్టర్‌ విక్రమ్‌ గుజ్జర్‌ అలియాస్‌ లాడెన్‌ హైదరాబాద్‌లో చిక్కాడు. సుదీర్ఘకాలం ఇతడి కోసం గాలించిన ఆ రాష్ట్ర పోలీసులు గత వారం సికింద్రాబాద్‌లో పట్టుకున్నారు. ఇతగాడు గత ఏడాది నవంబర్‌ నుంచి నగరంలోనే తలదాచుకున్నట్లు రాజస్థాన్‌ పోలీసులు చెప్తున్నారు. లాడెన్‌పై ఆ రాష్ట్రంలోని భీల్వాడీ, ఆల్వార్, జైపూర్‌ల్లోని వివిధ ఠాణాల్లో హత్య, హత్యాయత్నం, బెదిరింపులు, దోపిడీలు, బందిపోటు దొంగతనాలు, లూటీలు, తుపాకీతో కాల్పులు వంటి కేసులు నమోదై ఉన్నాయి. ఓ డెయిరీఫాం యజమానితో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఆయన ఆస్తుల్ని దగ్ధం చేసిన చరిత్ర లాడెన్‌కు ఉంది. ఆల్వార్‌లోని ఓ సాధారణ రైతు కుటుంబానికి చెందిన లాడెన్‌పై 2016లో తొలికేసు నమోదైంది. ఏ నేరంలోనూ విక్రమ్‌ గుజ్జర్‌ నేరుగా పాల్గొన్నాడు. కేవలం సోషల్‌మీడియా ద్వారా రిక్రూట్‌ చేసుకున్న అనుచరుల్నే వినియోగిస్తాడు. వీరికి అవసరమైన ఆయుధాలు, డబ్బు సమకూర్చడంతో పాటు సోషల్‌మీడియా ద్వారానే ఆదేశాలు జారీ చేస్తుంటాడు. ఈ పంథాలో లాడెన్‌ రాజస్థాన్‌లోని ఆల్వార్, బెహ్రూర్‌ ప్రాంతాల్లో అనేక నేరాలు చేయించాడు. ఇతడిపై ప్రస్తుతం 22 కేసులు నమోదై ఉన్నాయి. ప్రతి నెలా 26 లేదా 29 తేదీల్లోనే ఎక్కువ నేరాలు చేయడం ఇతడి సెంటిమెంట్‌. 

నగరంలో తలదాచుకుని..
కొన్నాళ్లు ఈశాన్య రాష్ట్రాల్లో ఉండి ఆపై ఢిల్లీ, ముంబై మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నాడు. పశ్చిమ మండలంలోని టోలిచౌకి ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని తలదాచుకున్నాడు. సోషల్‌మీడియా ద్వారానే బెహ్రూర్, ఆల్వార్‌ల్లో ఉన్న తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతూ వచ్చాడు. ఇతడి కోసం బెహ్రూర్‌ డీఎస్పీ అతుల్‌ సాహు తన బృందంతో ముమ్మరంగా వేటాడటం ప్రారంభించారు. ఈ విషయం తన అనుచరుల ద్వారా తెలుసుకున్న లాడెన్‌ ఓ దశలో ఆ డీఎస్పీకే ఫోన్‌ చేసి బెదిరించాడు. అందరితోనూ వాట్సాప్‌ ద్వారానే మాట్లాడే లాడెన్‌ ఆ అవకాశం లేని వారితో మాత్రం బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఉన్న పబ్లిక్‌ టెలిఫోన్లను వినియోగిస్తూ ఉంటాడు. 

ఆచూకీ ఇలా..
ఈ నేపథ్యంలో ఒకటిరెండుసార్లు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఉన్న పబ్లిక్‌ టెలిఫోన్ల నుంచి అల్వార్‌లో ఉన్న వారితో సంప్రదింపులు జరిపాడు. ఈ విషయం పసిగట్టిన అక్కడి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు లాడెన్‌ ఆచూకీ కనిపెట్టారు. ఇతడిని పట్టుకోవడానికి భిల్వాడీ నుంచి వచ్చిన ఓ ప్రత్యేక బృందం నగరంలో మాటు వేసింది. నాలుగు రోజుల పాటు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్దే మాటు వేసి ఎట్టకేలకు గత వారం పట్టుకుంది. ఇతడి నుంచి మూడు నాటు తుపాకులు, 30 తూటాలు స్వాధీనం చేసుకున్న భిల్వాడీ పోలీసులు హుటాహుటిన తమ రాష్ట్రానికి తరలించారు.

ఆధిపత్య పోరులో భాగంగా హత్య..
రాజస్థాన్‌లోని బెహ్రూర్‌ ప్రాంతంలో ఉన్న జైన్‌పూర్‌ బస్టాప్‌ వద్ద 2019 జూలై 29న బీఎస్పీ నేత జైస్రామ్‌ను హత్య చేయించాడు. ఈయన గత అసెంబ్లీ ఎన్నికల్లో అరప్పి నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. హిస్టరీ షీటర్‌ అయిన జైస్రామ్‌కు లాడెన్‌కు మధ్య ఆధిపత్యపోరు నేపథ్యంలో ఈ హత్య జరిగింది. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఇతడి కోసం రాజస్థాన్‌ పోలీసులు ముమ్మరంగా గాలించడంతో పాటు రూ.25 వేల రికార్డు ప్రకటించారు. ఒకే ఫోన్‌ నంబర్‌ వినియోగించకుండా, ఎక్కడా స్థిరంగా ఉండకుండా సంచరించిన లాడెన్‌ పోలీసుల కళ్లలో పడలేదు.

మరిన్ని వార్తలు