ఆ బాధితురాలికి పోలీస్‌ ఉద్యోగం

20 May, 2019 18:45 IST|Sakshi

జైపూర్‌ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్వార్‌ గ్యాంగ్‌రేప్‌ కేసు బాధితురాలికి రాజస్తాన్‌ ప్రభుత్వం పోలీస్‌ శాఖ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. గత నెలలో రాజస్తాన్‌లోని థనగాజి-ఆల్వార్ బైపాస్ రోడ్డు వద్ద బైక్‌పై వెళుతున్న దంపతులను అడ్డగించిన ఐదుగురు దుండగులు.. వారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి భర్త ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మే 2న స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాగా.. మే 4న ఈ జుగుప్సాకరమైన ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దుండగుల్లోని ఒకరు ఈ దుశ్చర్యను తన మొబైల్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశాడు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అధికార, ప్రతిపక్షాలు మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగాయి.

ప్రధాని నరేంద్రమోదీ, బీఎస్సీ ఛీఫ్‌ మాయావతి, ప్రముఖులంతా ఈ ఘటనను ఖండించారు. రాజకీయంగా దుమారం రేగంతో పోలీసులు సైతం వేగంగా స్పందించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అశోక్‌ గెహ్లాట్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావించగా.. బాధితురాలు పోలీసు శాఖలో పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేసింది. గ్యాంగ్‌ రేప్‌లకు పాల్పడే దుండగుల తాట తీస్తానని తెలపడంతో రాజస్తాన్‌ ప్రభుత్వం ఆ దిశగా అవకాశం కల్పిస్తూ.. బాధితురాలికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు