ఆసారాంకు బతికే హక్కు లేదు; నటి

27 Apr, 2018 12:27 IST|Sakshi

సాక్షి, ముంబై: అత్యాచార కేసులో ఆసారాం బాపుకు జీవితఖైదు శిక్షపై బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌ హర్షం వ్యక్తం చేశారు. అయితే మైనర్‌లపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ప్రాణాలతో ఉంచటం సరైందని కాదని ఆమె అంటున్నారు. అసారాం లాంటి వారికి ఉరిశిక్షే సరైందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

2013లో 16 ఏళ్ల బాలికపై ఆసారాం అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నేరం రుజువు కావటంతో ఈ ఏప్రిల్‌ 25న కోర్టు ఆసారాంకు జీవిత ఖైదు విధించింది. దీనిపై రాఖీ సావంత్‌ స్పందిస్తూ... ‘ఆసారాంకు శిక్ష పడ్డందుకు నాకు సంతోషంగా ఉంది. రేపిస్టులకు ఇదొక హెచ్చరిక. అయితే అతనికి ఉరి శిక్ష ఎందుకు వేయలేదు? బాధితురాలు మైనర్‌. పైగా మైనర్‌లపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించాలని ప్రభుత్వం అంటోంది. ఆ లెక్కన్న ఆసారాంకు కూడా మరణ శిక్ష వేయటమే సబబు. మైనర్లను చిదిమేసే రాక్షసులను వదలకూడదు’ అని రాఖీ సావంత్‌ వ్యాఖ్యానించారు. 

పోక్సో చట్టం సవరణ ద్వారా కేంద్రం తాజాగా జారీ చేసిన ఆర్డినెన్స్‌ ప్రకారం.. 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారికి మరణశిక్ష విధిస్తారు. 12 నుంచి 16 ఏళ్ల లోపు అమ్మాయిలపై లైంగిక దాడి చేస్తే జీవిత ఖైదు, లేదా కనీసం 20ఏళ్ల జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేయనున్నారు. దీంతో పాటు చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించిన కేసులు విచారణ త్వరితగతిన పూర్తి చేసేందుకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఈ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర కూడా వేశారు.

మరిన్ని వార్తలు