చైనా వ్యతిరేక ర్యాలీలో అమెరికా ఫోన్‌ గాయబ్‌!

31 Oct, 2017 09:23 IST|Sakshi

స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ నిరసనలో దొంగల చేతివాటం

ఢిల్లీ బీజేపీ చీఫ్‌ మనోజ్‌ తివారీకి చేదుఅనుభవం.. పోలీసులకు ఫిర్యాదు

సాక్షి, న్యూఢిల్లీ : ‘అంగడి అమ్మి గొంగళి కొన్నట్లు’ సామెత గుర్తుందికదా, దాదాపు అలాంటి చేదు అనుభవమే ఢిల్లీ బీజేపీ చీఫ్‌ మనోజ్‌ తివారీకి ఎదురైంది. చైనా వస్తువుల వ్యతిరేక ర్యాలీకి వెళ్లిన ఆయన.. తన అమెరికా ఐఫోన్‌ను పోగొట్టుకున్నారు. ఏం జరిగిందంటే..

చైనా వస్తువులను బహిష్కరించాలంటూ మత సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ వాణిజ్య విభాగమైన స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ సోమవారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఒక ర్యాలీని ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీ బీజేపీ చీఫ్‌ మనోజ్‌ తివారి కూడా పాలుపంచుకున్నారు. సభ ముగిసిన అనంతరం ఆయన తన ఫోన్‌ పోయినట్లు గుర్తించారు. అది.. అమెరికాకు చెందిన ఆపిల్‌ సంస్థ తయారి ‘ఐఫోన్‌ సెవెన్‌ ప్లస్‌’, ధర సుమారు రూ.55 వేలు!

అనుచరులతో ఎంత వెతికించినా లాభంలేకపోవడంతో చివరికి తివారీ కమలా మార్కెట్‌ పోలీసులను ఆశ్రయించారు. తన ఐఫోన్‌ తస్కరణకు గురైందని ఫిర్యాదుచేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఎంపీగారి ఫోన్‌ జాడను కనిపెట్టేపనిలో పడ్డారు. భోజ్‌పురి నటుడు, సంగీతకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న తివారీ.. 2014లో బీజేపీలో చేరి, ఈశాన్య ఢిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గత డిసెంబర్‌ నుంచి బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

మరిన్ని వార్తలు