రేవంత్‌ గుట్టంతా ఆ హార్డ్‌డిస్క్‌లో ఉందా?

2 Oct, 2018 10:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాల్లో భాగంగా పలువురికి నోటీసులిచ్చిన అధికారులు విచారణను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రేవంత్‌ అనుచరుడు, ఓటుకు కోట్లు కేసు నిందితుడు ఉదయ్‌ సింహ బంధువు రణధీర్‌ రెడ్డి వద్ద దొరికిన హార్డ్‌డిస్క్‌ హాట్‌ టాపిక్‌ అయింది. రెండు రోజుల క్రితం ఐటీ అధికారులమంటూ రణదీర్‌ రెడ్డిని తీసుకెళ్లిన టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు.. అతన్ని రాత్రి 12 గంటలకు తన నివాసం వద్ద వదిలివెళ్లారు. 

రణధీర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉదయ సింహ ఇళ్లు ఖాళీ చేస్తున్న సమయంలో తనకు ఓ కవర్‌ ఇచ్చాడని, అందులో ఒక హార్డ్‌ డిస్క్‌, అతని తల్లి బ్యాంక్‌ కీ ఉందని చెప్పారు. ఇక తనను తీసుకెళ్లింది టాస్క్‌ఫోర్స్‌ పోలీసులని, ఏ కేసు విషయంలో తనని తీసుకెళ్లారో తెలియదన్నారు.  పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని, ఆ విషయాలు పోలీసులే మీడియాకు తెలియజేస్తారన్నారు. ఉదయ్‌ సింహా తనకు ఫ్యామిలీ ఫ్రెండ్‌ అని, అతను ఇచ్చిన హార్డ్‌ డిస్క్‌లో ఏముందో తనకు తెలియదన్నారు. పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని, మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పారని, ఆ నోటీసులు అక్కడే మర్చిపోయానన్నారు. ఇప్పుడు స్టేషన్‌కు వెళ్లి తీసుకుంటానని తెలిపారు.

ఆ హార్డ్‌ డిస్క్‌లో ఏముంది?
రేవంత్‌ ప్రధాన అనుచరుడైన ఉదయసింహా ఇచ్చిన ఆ హార్డ్‌డిస్క్‌లో ఏముంది? అని, మూడు నెలల ముందే ఆ హార్డ్‌డిస్క్‌ రణదీర్‌ రెడ్డికి ఎందుకు ఇచ్చారు, రేవంత్‌ సంబంధించిన వ్యవహారాలు ఏమన్నా అందులో ఉన్నాయా? అనే అనుమానం కలుగుతోంది. ప్రస్తుతం ఈ కేసు ఈ హార్డ్‌డిస్క్‌  చుట్టే తిరుగుతోంది.

మరిన్ని వార్తలు