రాణి ఆత్మహత్య కేసులో విచారణ చేపట్టాలి

11 Dec, 2019 11:25 IST|Sakshi
బాధితులతో మాట్లాడుతున్న డీసీపీ కల్మేశ్వర్‌

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళన  

అడ్డగుట్ట: తుకారాంగేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన యువతి హుస్సేన్‌ సాగర్‌లో శవమై తేలిన విషయం తెలిసిందే. అయితే కొందరు వ్యక్తుల వేధింపుల కారణంగా రాణి ఆత్మహత్యకు పాల్పడిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం మృతదేహంతో తుకారాంగేట్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట అందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే... తుకారాంగేట్, బుద్ధానగర్‌కు చెందిన  అంజయ్య కుమార్తె రాణి(18) మారేడుపల్లిలోని వెస్లీ కాలేజీలో డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది.

నవంబర్‌ 21న కాలేజీకి వెళ్లిన రాణి తిరిగి రాలేదు. దీంతో 22న ఆమె కుటుంబసభ్యులు తుకారాంగేట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా 23న హుస్సేన్‌ సాగర్‌లో గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని గుర్తించిన లేక్‌ పోలీసులు గాంధీ మార్చురీలో భద్రపరిచారు. దీనిపై సమాచారం అందడంతో  తుకారాంగేట్‌ పోలీసులు రాణి కుటుంబ సభ్యులకు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి  మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చూపించారు. అయితే మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి ఉండడంతో వారు గుర్తించలేకపోయారు. దీంతో పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాణి కుటుంబ సభ్యులకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి మృతురాలు రాణిగా నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మంగళవారం  మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. 

ఆత్మహత్య కారకులను కఠినంగా శిక్షించాలి..
తమ కుమార్తె ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని మృతురాలి తండ్రి అంజయ్య పేర్కొన్నారు. రాణి ఆత్మహత్యకు కారకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ బాధిత కుటుంబసభ్యులు మంగళవారం రాత్రి తుకారాంగేట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. దీనిపై సమాచారాం అందడంతో నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ సింగెనవర్, గోపాలపురం ఏసీపీ వెంకటరమణ అక్కడికి వచ్చి  బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రాణి ఆత్మహత్యపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామన్నారు. ఇందుకు బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.

మరిన్ని వార్తలు