మృగాళ్లను కాల్చిచంపాలి

13 Mar, 2019 13:46 IST|Sakshi
నిందితులు

పొల్లాచ్చి ఘటనపై ప్రజాగ్రహం

నలుగురు నిందితులపై గూండా చట్టం

విచారణ సీబీసీఐడీకి అప్పగింత

సాక్షి ప్రతినిధి, చెన్నై: యువతులను మాయమాటలతో ప్రలోభపరుచుకుని వారి జీవితాలతో చెలగాటమాడిన నలుగురు నిందితులపై వివిధ పార్టీల నేతలు, సామాజిక సంఘాల ప్రతినిధులు భగ్గుమంటున్నారు. వారికి ఎంత పెద్ద శిక్ష వేసినా చాలదని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వారిని నిలువునా కాల్చివేయాలని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు సందేశాలు పెడుతున్నారు.పాఠశాల, కాలేజీ విద్యార్థినులు, గృహిణులతో స్నేహం నటించడం, మాయమాటలతో లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడడం, ఈ దృశ్యాలను సెల్‌ఫోన్ల ద్వారా వీడియోగా చిత్రీకరించి బెదిరించి సొమ్ము చేసుకోవడం ఈ నలుగురు కామాంధుల నిత్యకృత్యం. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చికి చెందిన మనుషుల రూపంలో ఉండే కీచక బృందానికి తిరునావుక్కరసర్‌ అనే యువకుడు నాయకుడు కాగా శబరిరాజన్,వసంతకుమార్, సతీష్‌ అనుచరులు. సుమారు రెండేళ్లుగా సాగుతున్న దారుణాలను నెలరోజుల క్రితం ఓ బాధిత యువతి బయటపెట్టడంతో వెలుగుచూసింది.

ముగ్గురు నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్‌ చేయగా, పరారీలో ఉన్న తిరునావుక్కరసర్‌ రెండురోజుల క్రితం తిరుపతిలో పట్టుబడ్డాడు. వీరి నుంచి సేకరించిన 5 సెల్‌ఫోన్లలో హృదయ విదారకమైన దృశ్యాలు బయటపడ్డాయి. అనేక మంది యువతులు నగ్నంగా నిల్చుని ‘అన్నా నన్ను వదిలేయి, నిన్ను నమ్మికదా వచ్చాను’ అంటూ బిగ్గరగా రోదిస్తుండగా ఈ యువకులు వికృతానందం పొందుతున్నారు. మరికొందరు యువతులచేత బలవంతంగా డాన్సులు వేయించారు. ఇలా సుమారు 200 మంది యువతులు వీరి బారిన పడినట్లు సమాచారం. అయితే బయటపడితే పరువు పోతుందనే భయంతో ఎవ్వరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో ఈ మృగాళ్లు మరింత రెచ్చిపోయారు.

ఎట్టకేలకూ పాపం పండగా పోలీసులకు చిక్కారు. నిందితులు అరెస్టయిన తరువాత మరో బాధిత యువతి పోలీçసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నిందితులపై గూండా చట్టం ప్రయోగించి కేసులు పెట్టారు. నిందితుల వెనుక అధికార అన్నాడీఎంకే నేతల హస్తం ఉందని, వీడియో దృశ్యాలను చెరిపివేయడం ద్వారా కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని డీఎంకే ఆరోపిస్తోంది. ఇదే ఆరోపణలపై ఎంపీ కనిమొళి మంగళవారం పొల్లాచ్చిలో ధర్నా చేపట్టింది. దీంతో ఈ కేసు తీవ్రత దృష్టా విచారణ బాధ్యతను సీబీసీఐడీకి అప్పగించారు. జామీను కోరుతూ తిరునావుక్కరసర్‌ చేసుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. పొల్లాచ్చి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షులు కమల్‌హాసన్‌ మంగళవారం చెన్నై పోలీస్‌ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నటీనటులు శరత్‌కుమార్, సిద్ధార్థ్, జీవి ప్రకాష్‌ కుమార్, గాయత్రీరఘురాం, గాయని చిన్మయి తీవ్రంగా ఖండించారు. కోయంబత్తూరులో ఇండియా మానవర్‌ సంఘం వారు మంగళవారం ధర్నా చేయగా ఐదు మంది మహిళలు సహా 51 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

మరిన్ని వార్తలు