మృగాళ్ల దాష్టీకం

14 Jun, 2018 11:15 IST|Sakshi
సీమాంక్‌ సెంటర్‌లో పురిటి బిడ్డతో నాగమణి

మతిస్థిమితం లేని యువతిని తల్లిని చేశారు!

గూడూరు ఏరియా ఆస్పత్రిలో ఆడబిడ్డ ప్రసవం

నెల్లూరు , గూడూరు: మతిస్థిమితంలేని యువతిని కొందరు మృగాళ్లు తల్లిని చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా తమ కామవాంఛ తీర్చుకుని గర్భవతిని చేశారు. పురిటి నొప్పులతో అల్లాడుతుండగా గూడూరు ఏరియా ఆస్పత్రి సీమాంక్‌ సెంటర్‌లో స్థానికులు చేర్చారు. ఆమె ఆడబిడ్డను ప్రసవించింది. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది.  గూడూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈ నెల 7వ తేదీన పురిటి నొప్పులు పడుతూ కింద పడి అల్లాడుతున్న ఓ యువతిని అక్కడే పండ్లు అమ్ముకునే ఓ మహిళ చూసింది. ఆమె ఆ పరిసరాల్లో ఎంత సేపు చూసినా కూడా ఆ యువతి వద్దకు ఎవరూ రాకపోవడంతో ఆమె దగ్గరకు వెళ్లి చూడగా, ఆ యువతి నిండు గర్భిణిగా గుర్తించి ఆటోలో స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద వదిలేసి వెళ్లిపోయింది.

ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది ఆ యువతిని స్ట్రెక్చర్‌పై తీసుకెళ్లి సీమాంక్‌లో చేర్పించారు. అక్కడ విధుల్లో ఉన్న వైద్యులు ఆమెకు పురుడు పోశారు. మృగాళ్ల కామవాంఛకు బలైన ఆ యువతి ఆడ బిడ్డను ప్రసవించింది. అప్పటి నుంచి ఆస్పత్రి వైద్యులు, సిస్టర్‌లు ఆమె వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించగా, తన పేరు నాగమణి, తండ్రి పేరు రమణయ్య, తల్లి లక్ష్మమ్మగా చెబుతోంది. తాను కోట, గూడూరులోనూ భిక్షమెత్తుకుని జీవనం సాగిస్తుంటానని కొంత సేపు చెబుతోంది. కొంత సేపు ఏమీ చెప్పుకుండానే మౌనంగా అమాయక చూపులు చూస్తూ ఉంటుంది. ఆస్పత్రి సిబ్బంది 1వ పట్టణ పోలీసులకు ఇవ్వడంతో వారు వచ్చి విచారించి వెళ్లారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకూ ఆమె కోసం ఎవరూ రాలేదు. ఐసీడీఎస్‌ అధికారులకు కూడా సమాచారం ఇవ్వగా, వారు వచ్చి తమతో రావాలని కూడా చెప్పగా, తాను రానని, మా అవ్వ వస్తోందని మీతో రానని చెబుతుందని ఆస్పత్రి సిబ్బంది అంటున్నారు.

మరిన్ని వార్తలు