అత్యాచార బాధితురాలి మృతి

28 Feb, 2018 07:07 IST|Sakshi
మృతదేహం వద్ద విలపిస్తోన్న బంధువులు, కుటుంబసభ్యులు

నిందితుడిపై నిర్భయ, హత్య కేసుల నమోదు

తొగర్రాయిలో ఉద్రిక్తత

సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ

దుగ్గొండి(నర్సంపేట): వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయిలో  లైంగికదాడితోపాటు హత్యాయత్నానికి గురై అపస్మారక స్థితికి చేరిన గురైన వివాహిత వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున  తుదిశ్వాస విడిచింది. బాధితురాలి మృతితో తొగర్రాయిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, సీఐ బోనాల కిషన్‌ కథనం ప్రకారం.. వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు  నల్ల అనిత(34), నర్సయ్య కూలీ పనిచేస్తూ జీవ నం సాగిస్తున్నారు.

ఈ నెల 25న ఆదివారం ఉదయం ఇదే గ్రామానికి చెందిన కొక్కరకొండ కుమారస్వామి–లలిత దంపతులు తమ మొక్కజొన్న చేనులో తలసంచులు తుంచి వేయడానికి అనితతోపాటు మరో ముగ్గురిని కూలీకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో  అనితకు పరిచయస్తుడైన కారు అశోక్‌ మొక్కజొన్న చేను వద్దకు వచ్చి అనితను  పిలవడంతో ఆమె చేను కింది భాగానికి వచ్చింది. అక్కడ ఏమైందో తెలియదుగాని    మొక్కజొన్న చేనులోనే అనితపై అశోక్‌ లైంగికదాడికా పాల్పడ్డాడు. ఆపై పలుచోట్ల   విచక్షణారహితంగా చితకబాదడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

రాత్రి 7 గంటల సమయంలో అనితకు ఫిట్స్‌ వచ్చి మొక్కజొన్న చేను వద్ద పడిపోయిందని నమ్మించిన అశోక్‌ ఆమె బావ కుమారుడు నల్ల రాజుకు సమాచారం ఇచ్చాడు. నానాజీ అనే వ్యక్తికి  ఫోన్‌ చేసి ఆటోను రప్పించాడు. రాజు రాగానే ఇద్దరూ కలిసి అనితను ఆటోలో వేసి స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీకి చూపించగా వరంగల్‌కు తీసుకెళ్లాలని సూచించడంతో 108లో కుటుంబ సభ్యులు అదేరోజు రాత్రి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ  క్రమంలో చికిత్సపొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది.

 సంఘటన స్థలాన్ని నర్సంపేట ఏసీపీ సునీత పరిశీలించారు. అక్కడ అనిత ధరించిన  చొక్కాతోపాటు మంగళసూత్రం దొరకడంతో స్వా«ధీ నం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలని సీఐ బోనాల కిషన్, ఎస్సై ఊరడి భాస్కర్‌రెడ్డిని  ఆదేశించారు. మృతురాలికి భర్త నర్సయ్య, కూతుళ్లు రిజ్వానా, జ్యోత్స్న ఉన్నారు. 

నిందితుడిపై నిర్భయ, హత్య కేసు.. 
నల్ల అనిత వద్ద ఉన్న చనువుతో ఇదే గ్రామానికి చెందిన కారు అశోక్‌ ఆమెపై లైంగికదాడికి పాల్పడి, విచక్షణరహితంగా పలు చోట్ల దాడి చేయడంతోనే తీవ్ర గాయాలపాలై  చనిపోయినట్లు మృతురాలి బావ నల్ల సారయ్య చేసిన ఫిర్యాదు మేరకు అశోక్‌పై నిర్భయ కేసుతోపాటు హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ బోనాల కిషన్‌ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, నింది తుడిని పట్టుకుని విచారణ చేస్తామని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా నిందితుడు అశోక్‌ సెల్‌ఫోన్‌కు ఆ రోజు ఏ ఏ నంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయనే విషయాలపై కాల్‌డేటాను పోలీసులు సేకరించినట్లు తెలిసింది. సమగ్ర విచారణ తర్వాత మిగతా నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.  

గ్రామంలో ఉద్రిక్తత.. 
అనిత మృతదేహం ఎంజీఎం మార్చురీ నుంచి గ్రామానికి చేరుకోగా మృతురాలి  బంధువులు మృతదేహాన్ని హత్య చేసిన వ్యక్తి ఇంటి ముందు వేస్తామని భీష్మించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని అరగంటపాటు ఆందోళన చేశారు. అనంతరం సీఐ కిషన్‌ సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఘటనపై అనేక అనుమానాలు 
కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న అనితపై అత్యాచారం, ఆపై హత్య చేయడంపై గ్రామస్తులు , బంధువులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనితపై ఇంతలా అఘాయిత్యం జరుగుతుంటే కూలీకి తీసుకెళ్లిన రైతులుగానీ, ఆమెతోపాటు వెళ్లిన తోటి కూలీలుగానీ ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సదరు వ్యక్తులంతా సంఘటన తర్వాత కనిపించకుండపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అనిత ఒంటిపై పలుచోట్ల విచక్షణారహితంగా నలిపిన గాయాలు ఉండటం, పెదాలు వాచిపోయి ఉండటంతో అత్యాచారం ఘటన ఒక్కరు చేయడం సాధ్యం కాదని, మరికొందరు కూడా ఉండి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా నిరుపేద దళిత మహిళ మృతికి కారకులైన వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు