రేషన్‌ బియ్యం మాఫియా డాన్‌ అరెస్ట్‌

3 Jun, 2020 11:48 IST|Sakshi
నిందితులను చూపిస్తున్న సీఐ సుబ్బరాయుడు

250 ప్యాకెట్ల రేషన్‌ బియ్యం పట్టివేత

రెండు లారీలు సీజ్‌

కోవెలకుంట్ల: కొన్నేళ్ల నుంచి గుట్టు చప్పుడు గాకుండా రేషన్‌ బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్న మాఫియా డాన్‌ను ఎట్టకేలకు కోవెలకుంట్ల పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడి వివరాలను మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ లో కోవెలకుంట్ల సీఐ సుబ్బరాయుడు విలేకరు లకు వెల్లడించారు.బనగానపల్లెకు చెందిన శ్రీనివాసులు అలియాస్‌ డాన్‌ శ్రీను రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన రేషన్‌బియ్యాన్ని పట్టణ శివారులోని ఐటీఐ కళాశాల సమీపంలో కోవెలకుంట్లకు చెందిన స్వామిరెడ్డి, బనగానపల్లెకు చెందిన ఉసేన్‌బాషా లారీలో నుంచి మరో లారీలోకి రేషన్‌ బియ్యాన్ని మార్పిడి చేస్తుండగా కోవెలకుంట్ల ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారు.

250ప్యాకెట్ల(125 క్వింటాళ్లు) రేషన్‌ బియ్యం, రెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యానికి సంబంధించి వివరాలు ఆరా తీయగా బనగానపల్లెకు చెందిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు బియ్యాన్ని తరలించేందుకు మార్పిడి చేస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. వారిద్దరితోపాటు శ్రీనివాసులు, కొలిమిగుండ్ల మండలం బెలూంకు చెందిన చిన్న ప్రసాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మరోనిందితుడు చిన్న ప్రసాదు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని చెప్పారు. మిగిలిన ముగ్గురిని కోవిడ్‌ పరీక్షల అనంతరం బనగానపల్లె మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరచనున్నట్లు సీఐ వివరించారు. 

మరిన్ని వార్తలు