బాబు గోగినేనిపై చర్యలకు రంగం సిద్ధం

19 Jul, 2018 16:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ హేతువాది బాబు గోగినేనిపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. ఆయనకు నోటీసులు జారీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. నేడో, రేపో బిగ్‌బాస్‌ తెలుగు రియాల్టీ షో నిర్వాహకుల చేతికి నగరంలోని మాదాపూర్‌ పోలీసులు అందుకు సంబంధించిన నోటీసులు అందజేయనున్నారు. నోటీసులు అందుకున్నాక వివరణ ఇచ్చుకునేందుకు 48 గంటలు సమయం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఇటీవల బాబు గోగినేనిపై కేసు నమోదైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఓ పిటిషనర్  హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఈనెల 25వ తేదీలోగా బాబు గోగినేని కేసు పురోగతిపై కౌంటర్ దాఖలు చేయాలని సైబరాబాద్ పోలీసులను ఆదేశించింది.

బాబు గోగినేనిపై గత నెలలో తీవ్రమైన నేరారోపణలతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆధార్ చట్టాన్ని ఉల్లంగిస్తూ ఔత్సాహికుల ఆధార్ సమాచారాన్ని సేకరిస్తున్నారని, హేతువాద ప్రచారం కోసం నిధులు దుర్వినియోగం పరుస్తున్నారని పిటిషనర్‌ కేవీ నారాయణ తన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గోప్యంగా ఉంచాల్సిన ఆధార్‌ సమాచారాన్ని బాబు గోగినేని, ఆయన అనుచరులు తమ సంస్థల ద్వారా పక్క దేశాలకు అందజేస్తున్నారని ఆరోపించారు. ఇది దేశ భద్రతకు కూడా ప్రమాదంగా మారుతుందని వారు ఫిర్యాదులో తెలిపారు. దీంతో దేశ ద్రోహం, మత విశ్వాసాలను అవమానించడం, అనుచిత ప్రచారంతో పాటు, ఆధార్ చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు