-

పోలీసుల ఎదుట హాజరైన రవిప్రకాశ్‌

4 Jun, 2019 16:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ సీసీఎస్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫోర్జరీ, డేటా చౌర్యం కేసుల్లో నిందితుడిగా ఉన్న రవిప్రకాశ్‌ గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్‌ తెచ్చుకోవడానికి రవిప్రకాశ్‌ తీవ్రంగా ప్రయత్నించారు. అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రవిప్రకాశ్‌పై ఫొర్జరీ కేసు నమోదు చేశారు. అయితే ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్లు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టు తిరస్కరించాయి. దారులన్నీ మూసుకుపోవడంతో రవిప్రకాశ్‌ పునారాచనలో పడినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన మంగళవారం సీసీఎస్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరయినట్టుగా తెలుస్తోంది. 

అన్ని విషయాలపై ప్రశ్నిస్తాం : సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ 
రవిప్రకాశ్‌ విచారణకు హాజరు కావడంపై సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ శ్రీనివాసరావు స్పందించారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసుకు సంబంధించిన అన్ని విషయాలపై రవిప్రకాశ్‌ను ప్రశ్నిస్తామని తెలిపారు. రవిప్రకాశ్‌ చెప్పేదాన్ని బట్టి ఎన్ని రోజులు విచారణ చేయాలనేదానిపై ఆలోచిస్తామన్నారు. తమ దగ్గర ఉన్న ఆధారాలతో అతన్ని ప్రశ్నిస్తామని వెల్లడించారు.

రవిప్రకాశ్‌పై కేసులు..
శాంకినేని శివాజితో కలిసి నకిలీ కొనగోలు పత్రాల సృష్టి, నిధుల మళ్లింపు, కుట్ర, సంస్థ కార్యదర్శి సంతకం ఫోర్జరీ తదిత ఆరోపణలపై హైదరాబాద్‌ పోలీసులు వివిధ కేసులు నమోదు చేశారు. టీవీ9 లోగో, కాపీరైట్స్‌, ట్రేడ్‌మార్క్‌లు 2018 మేలో మీడియా నెక్స్ట్‌ ఇండియా కంపెనీకి బదలాయించడంపై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

అయితే రవిప్రకాశ్‌ కోసం పోలీసులు ఆయా నగరాల్లో గాలింపు చేపట్టిన సంగతి తెలిసిందే.పోలీసులు ఎంత గాలించినా.. రవిప్రకాశ్‌ పదేపదే స్థావరాలు మారుస్తూ వస్తున్నాడు. ఇప్పటి దాకా దాదాపు 30 సిమ్‌ కార్డులు మారుస్తూ. సోషల్‌ మీడియాలో స్నేహితులతో మంతనాలు సాగిస్తున్నాడు. పరారీలో ఉంటూనే హైకోర్టులో రెండుసార్లు, సుప్రీంకోర్టులోనూ ముందస్తు బెయిల్‌ కోసం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు.

చదవండి : సుప్రీంకోర్టులో రవిప్రకాశ్‌కు చుక్కెదురు

మరిన్ని వార్తలు