రెండోరోజూ అదే తీరు!

6 Jun, 2019 02:36 IST|Sakshi

విచారణకు సహకరించని రవిప్రకాశ్‌

అడిగిన ప్రశ్నలకు బదులివ్వని టీవీ9 మాజీ సీఈఓ

దర్యాప్తును తప్పుదోవ పట్టించే యత్నం

రెండో నోటీసు ఇవ్వనున్న బంజారాహిల్స్‌ పోలీసులు

ఆ కేసులో విచారణకు రాకుంటే అరెస్టు చేసే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసు విచారణలో టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ తీరు మారలేదు. రెండోరోజు కూడా ఆయన పోలీసులకు సహకరించలేదు. బుధవారం ఉదయం 11.30 గంటలు దాటిన తర్వాత సైబర్‌ క్రైం కార్యాలయానికి వచ్చిన రవిప్రకాశ్‌.. అక్కడ మీడియాతో మాట్లాడిన అనంతరం విచారణ కోసం లోపలకు వెళ్లారు. అప్పటి నుంచి రాత్రి 10.30 గంటల వరకు 11 గంటలపాటు పోలీసులు ఆయన్ను విచారించారు. ప్రధానంగా అలందా మీడియా కార్యదర్శి కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన రెండు కేసులపై పోలీసులు ప్రశ్నలు సంధించారు. టీవీ9 పాత యాజమాన్యం నుంచి అలందా మీడియాకు యాజమాన్య బదిలీలు జరగకుండా ఉండేందుకు నకిలీ పత్రాలు సృష్టించడం, కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి మినిస్ట్రీ ఆఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడంపై నమోదైన రెండు కేసులకు సంబంధించి పోలీసులు విచారించారు. అయితే, విచారణలో తమకు రవిప్రకాశ్‌ ఎంతమాత్రం సహకరించలేదని పోలీసు అధికారులు తెలిపారు. 

పోలీసులు అడిగిన ప్రశ్నలివే...
రవిప్రకాశ్‌ని విచారించడానికి పోలీసులు ముందుగానే ప్రశ్నావళిని సిద్ధం చేసుకు న్నారు. ‘‘కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్‌ సంతకాన్ని ఎవరు, ఎందుకు ఫోర్జరీ చేశారు? తాజాగా కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలతో ఎన్‌సీఎల్టీకి పాత తేదీలతో శివాజీతో మీరు ఫిర్యాదు చేయించ డానికి కారణాలేంటి? శివాజీకి 40వేల షేర్లు ఎందుకు విక్రయించారు? మీ స్నేహితుడైన శివాజీకి షేర్లు బదిలీ చేయకుండా ఎందుకు మోసగించారు? టీవీ9 యాజమాన్య మార్పిడి జరిగినప్పుడు సీఈఓగా దానిని కొత్త యాజమాన్యానికి అప్పగించాల్సిన బాధ్యత మీకు లేదా’’అంటూ ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.  కాగా,  తనపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే కాకుండా మోజో టీవీని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని రవిప్రకాశ్‌ మీడియా ముందు ధ్వజమెత్తారు.

పెండింగ్‌లోనే మరో కేసు...
టీవీ9 వ్యవహారంలో రవిప్రకాశ్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లోనూ మరో కేసు పెండింగ్‌లో ఉంది. టీవీ9 లోగో, కాపీ రైట్స్, ట్రేడ్‌మార్కులను 2018 మే నెలలో మోజో టీవీకి విక్రయించారనే ఆరోపణలపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గతంలో ఇచ్చిన నోటీసుకు రవిప్రకాశ్‌  స్పందించలేదు. ఈ నేపథ్యంలో రెండోసారి నోటీసు జారీచేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. రెండో నోటీసు జారీచేసిన తర్వాత కూడా విచారణకు హాజరు కాకుంటే రవిప్రకాశ్‌ను అరెస్టు చేసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు