ఏసీబీకి చిక్కిన ఈఈ 

27 Feb, 2018 02:38 IST|Sakshi

రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుబడిన రవీందర్‌రావు 

విద్యారణ్యపురి/ వరంగల్‌ క్రైం: రాష్ట్ర విద్యామౌలిక సదుపాయాల సంస్థ ఈఈగా పనిచేస్తున్న రవీందర్‌రావు ఏసీబీకి చిక్కాడు. హన్మకొండలోని రూరల్‌ డీఈఓ కార్యాలయంలో తన చాంబర్‌లో ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను వలపన్ని పట్టుకున్నారు. వరంగల్‌ జోన్‌ ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్‌ సుదర్శన్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సీఎంఏ ఫండ్‌ కింద డ్యూయల్‌ డెస్క్‌ల సరఫరాకు సంబంధించి రూ.5 లక్షలు లంచం ఇస్తేనే బిల్లు ఇస్తామని కాంట్రాక్టర్‌ వన్నాల కన్నాకు ఈఈ స్పష్టం చేశాడు. దీంతో సదరు కాంట్రాక్టర్‌ ఏసీబీని ఆశ్రయించారు.

సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈఈ రవీందర్‌రావుకు అతని చాంబర్‌లో వన్నాల కన్నా రూ.3 లక్షలు ఇచ్చారు. ఈ సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని సుదర్శన్‌గౌడ్‌ తెలిపారు. ఈఈ రవీందర్‌రావుపై పలు ఆవినీతి ఆరోపణలు ఉన్నాయని.. వాటన్నింటిపైనా సమగ్ర విచారణ చేపడతామని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు