ప్లాట్‌ కొంటే..ఉద్యోగమట

20 Aug, 2018 12:28 IST|Sakshi
ఈ జామాయిల్‌ తోటనే రియల్‌ఎస్టేట్‌ వెంచర్‌ (ఇన్‌సెట్‌) జగన్నాథపురం గ్రామం వ్యూ

భూ మాయ     సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ విస్తరణ పేరిట వ్యాపారం

అక్రమ రిజిస్ట్రేషన్‌తో రూ.2.04 కోట్లు దండుకున్న వైనం

ఖమ్మం కేంద్రంగా సాగిన మోసం

సత్తుపల్లి : ‘ సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌లో భూమి పోతే, దానికి బదులు పరిహారంతో పాటు ఉద్యోగం వస్తుంది. కేవలం రూ.3 లక్షలు చెల్లించి ప్లాట్‌ తీసుకోండి..ఆ తర్వాత మిగతా రూ.3 లక్షలు చెల్లించండి. ఎంచక్కా జాబ్, ఇళ్లప్లాట్‌ సొంతం చేసుకోండి..’అంటూ ఖమ్మంకేంద్రంగా ముగ్గురితో కూడిన ఓ రియల్‌ వ్యాపార ముఠా ఏకంగా 68 మందికి 200 గజాల చొప్పున ప్లాట్లు విక్రయించి రూ.2.04 కోట్లు కుచ్చుటోపీ పెట్టింది. ఇలా దర్జాగా సాగుతున్న రియల్‌ వెంచర్‌ లీలలు..అక్రమ రిజిస్ట్రేషన్‌ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

ఈ లోపాలను ఎత్తిచూపుతూ మార్చి 14న ‘సాక్షి’లో ‘రియల్‌ టోకరా!’ పేరుతో కథనం ప్రచురితమైన విషయం విదితమే. సత్తుపల్లి మండలం కిష్టారం ఓపెన్‌కాస్టులో చెరుకుపల్లి పంచాయతీ జగన్నాథపురం రెవెన్యూలో ఈ తతంగం జరిగినట్లు అప్పట్లో జరిగిన అవార్డు ఎంక్వైరీలో వెలుగుచూసింది. ఆ రియల్టర్‌ మాత్రం ఖమ్మం, కరీంనగర్, వరంగల్, సిద్ధిపేట, హైదరాబాద్‌లలో రియల్‌ వెంచర్లు వేసుకుంటూ దర్జాగా తిరుగుతున్నాడని, అధికార పార్టీ లో పెద్దల అండదండలు ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని, పెద్దస్థాయి నేతల ఫొటోలు చూపిస్తూ కాలం వెళ్లదీస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు.  

ముందుచూపుతో పక్కాస్కెచ్‌.. 

ఎంత పక్కాగా స్కేచ్‌ వేశారంటే..ప్లాట్లు అమ్మేటప్పుడే రూ.3లక్షలు ముందుగా చెల్లించిన తర్వాత మిగతా రూ.3లక్షలు ఉద్యోగం, పరిహారం వచ్చిన తర్వాత చెల్లించాలనేది వీరు పెట్టుకున్న షరతు. ఆ డబ్బులు అప్పుడిస్తారో లేదోనని ముందుచూపుతో ఖాళీ డాక్యుమెంట్లపై సంతకాలు కూడా తీసుకుని..మరింత నమ్మించి మోసం చేశారని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

200 గజాలకే జాబ్‌ ఎలా వస్తుందని ప్రశ్నిస్తే.. ఇన్ని అనుమానాలు అవసరం లేదు.. ఇప్పటికే చాలా మందికి అమ్మేశాం.. ఇష్టమైతే తీసుకోండి.. కావాలంటే కొనుగోలు చేసిన వాళ్ల అడ్రస్‌లు ఇస్తాం వెళ్లి మాట్లాడుకోండి..అంటూ నమ్మకంగా చెప్పేవారని తెలిసింది. కుమారుడి జీవితం బాగుపడుతుందనే ఆశతో తమలాంటి ఎంతోమంది రియల్టర్‌ మాటలు నమ్మి.. చైన్‌ సిస్టమ్‌లో చాలామంది మోసపోయామని లబోదిబోమంటున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వమని బాధితులు ఎన్నిసార్లు మొత్తుకున్నా.. ఇస్తామంటూ.. మభ్యపెడుతున్నారని వాపోతున్నారు.  

ఆన్‌లైన్‌లో అక్రమ రిజిస్ట్రేషన్‌.. 

చెరువుకు ఆనుకొని ఉన్న జామాయిల్‌ తోటను వాణిజ్య భూమిగా బదలాయించకుండా ఎలాంటి అధికారిక లేఅవుట్‌ లేకుండా అంతా కాగితాలపైనే ప్లాట్లు చేసి ఖమ్మం కేంద్రంగా ఆన్‌లైన్‌లో అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మేస్తున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల పట్టింపు లేకనే ఇలా సాగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగన్నాథపురం రెవెన్యూలో సర్వే నంబర్‌ 65లో 3.15 ఎకరాల భూమిని రూ.37.50 లక్షలకు 2015 సెప్టెంబర్‌లో అదే గ్రామానికి చెందిన చిలుకూరి జగన్మోహన్‌రెడ్డి నుంచి ఖమ్మంకు చెందిన ఎస్‌కె.నాగుల్‌మీరా 1.27 ఎకరాలు, అలవాల నాగబ్రహ్మాచారి 35 కుంటలు, అబ్దుల్‌ మజీద్‌ 35 కుంటల చొప్పున కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. వీటిలో 200గజాల చొప్పున 68ప్లాట్లు చేసి ఒక్కో ప్లాట్‌ రూ.6లక్షల చొప్పున మొత్తం 68 ప్లాట్లు రూ.4.08 కోట్లకు క్రయవిక్రయాలు జరిపినట్లు తెలిసింది.   

పరిహారం సొమ్ము కూడా.. 

కిష్టారం ఓపెన్‌కాస్టులో భూమి కోల్పోతున్న రైతులకు పట్టాభూమి రికార్డును అనుసరించి పరిహారం అందిస్తారు. అయితే ఒకరిద్దరు మినహా ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పరిహారం కూడా అక్రమార్కులకే వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎకరాకు ప్రభుత్వం రూ.12 లక్షలు నుంచి రూ.15 లక్షలు చెల్లించే అవకాశం ఉంది. 200 గజాలకు పరిహారం కేవలం రూ.50వేల నుంచి రూ.62వేల వరకే వచ్చే అవకాశముంది. రూ.3 లక్షల చొప్పున కొనుగోలు చేసిన బాధితులకు రూ.2.38 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు నష్టపోనున్నారు.  

పరిహారం సొమ్ము నిలిపివేస్తాం.. 

జగన్నాథపురం సర్వే నంబర్‌ 65లో 3.17 ఎకరాల భూమిలో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌కు ఎలాంటి అనుమతులు లేవు. ఇద్దరు బాధితులు మాత్రమే ఫిర్యాదు చేశారు. పరిహారాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తాం. విచారణ చేసిన తర్వాతనే పరిహారం ఎవరికి అందించాలో నిర్ణయిస్తాం.  

– దొడ్డా పుల్లయ్య, తహసీల్దార్, సత్తుపల్లి   

మరిన్ని వార్తలు