అనుమానాస్పద స్థితిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మృతి

18 Jun, 2019 07:11 IST|Sakshi

సాక్షి, ఆదోని(కర్నూలు) : పట్టణానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దిబ్బనకల్‌ గ్రామ సరిహద్దు పొలాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించిన ఆనవాళ్లు, పక్కనే బాటిల్, స్కూటీ ఉండటంతో హత్యనా? ఆత్మహత్యనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఇందిరా నగర్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నాయీ బ్రాహ్మణ బసవరాజు(42) నివాసముంటున్నాడు. బార్బర్‌ షాపుతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. మృతుడికి భార్య సువర్ణమ్మ, కొడుకులు సునీల్‌కుమార్, వేణుగోపాల్, కూతురు సునీత ఉన్నారు.

ఆదివారం సాయంత్రం రోజూ మాదిరిగా బయటకు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి వెళ్లాడు. రాత్రి 8 గంటలైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్‌ చేయగా రింగ్‌ అవుతున్నా లిఫ్ట్‌ చేయకపోవడంతో అనుమానంతో తెలిసిన చోటల్లా విచారించారు. 10 గంటల తరువాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఫోన్‌ చేయగా రింగ్‌ అయింది కానీ లిఫ్ట్‌ చేయలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సెల్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా వెతకడం ప్రారంభించారు. సెల్‌ఫోన్‌ ఉన్నట్లు మొదట ఢణాపురం, తర్వాత మిల్టన్‌ హైటెక్‌ స్కూల్‌ ఏరియాల్లో చూపించడంతో అక్కడా వెదికారు. మిల్టన్‌ హైటెక్‌ స్కూల్, బాటమారెమ్మ గుడి సమీపంలోని కొండ ప్రాంతం వైపు వెళ్లగా స్కూటీ కనిపించింది. ఫోన్‌ రింగ్‌ కూడా స్కూటీలో నుంచి వినింపించింది. కాస్త ముందుకు వెళ్లి చూడగా, ఓ కొండ దిగువన బండరాయి మధ్య కాలిపోయిన మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.  

ఘటనా స్థలం పరిశీలన 
దిబ్బనకల్‌ సరిహద్దు ప్రాంతంలోని ఓ కొండ దిగువన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు తెలుసుకున్న డీఎస్పీ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. టూ టౌన్‌ సీఐ భాస్కర్, తాలూకా ఎస్‌ఐ రామాంజులు సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. రెండు లీటర్లు వాటర్‌ బాటిల్, చెప్పులు పడివుండటాన్ని గమనించి, పెట్రోల్‌ పోసి తగులబెట్టారా? లేక ముందుగానే హత్యచేసి ఆపై పెట్రోల్‌పోసి నిప్పంటించారా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని డీఎస్పీ చెప్పారు. కుటుంబ సభ్యులను ఆరా తీశారు.   

నా చావుకు కారణం నేనే.. 
‘నా చావుకు నేనే కారణం. ఎవరు కాదు. ఇంట్లో వాళ్లు, బయటి వాళ్లకు ఎలాంటి సంబంధం లేదు. తన ఆరోగ్యం బాగాలేని కారణంగానే నేను చనిపోతున్నాను’. అని నోట్‌బుక్‌లో సూసైడ్‌ నోట్‌ రాసి ఉంచినట్లు తాలూకా ఎస్‌ఐ రామాంజులు తెలిపారు. అయినా మృతిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామనిన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.    

మరిన్ని వార్తలు