మాదాపూర్‌లో భారీ మోసం

1 Jul, 2020 16:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాదాపూర్‌లో భారీ మోసం బ‌య‌ట‌పడింది. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో కోట్లాది రూపాయ‌లు వ‌సూలు చేసిన‌ కుంభ‌కోణం బుధ‌వారం బ‌ట్ట‌బ‌య‌లైంది. న‌గ‌రానికి చెందిన‌ యార్లగడ్డ రఘు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అధిక వడ్డీ ఇస్తానంటూ ప‌లువురిని న‌మ్మించాడు. ఆ త‌ర్వాత వారి ద‌గ్గ‌ర‌ నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అత‌ని మాటలు న‌మ్మిన అనేక‌మంది పెద్ద మొత్తంలో ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఇదంతా మోస‌మ‌ని గ్ర‌హించిన ఓ బాధితుడు మాదాపూర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ర‌ఘును అదుపులోకి తీసుకొని విచారించ‌గా వేల‌మందిని మోసం చేసినట్లు తెలుస్తోంది. (గర్భిణి మృతదేహాన్ని చెట్టుకు కట్టి వదిలేశారు)

మ‌రోవైపు ర‌ఘును అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలిసిన బాధితులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ ద‌గ్గ‌ర‌ పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. వీరంతా ల‌క్ష రూపాయల నుంచి కోటి రూపాయల వరకు రఘు రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అధిక వడ్డీకి ఆశపడి తమకు తెలిసిన వారితో పెద్ద మొత్తంలో అప్పులు ఇప్పించామ‌ని బాధితులు ల‌బోదిబోమంటున్నారు. 200 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు మోసానికి పాల్ప‌డిన‌ట్లు బాధితులు పేర్కొంటున్నారు. ఈ కేసును సీఐడీతో విచారణ జరిపించే అవకాశం ఉన్నట్టు క‌నిపిస్తోంది. (సైబర్‌ యుగంలో స్వాహాల పర్వం)

మరిన్ని వార్తలు