అన్న హత్యకు పథకం.. తమ్ముడే హతం

26 Jun, 2020 08:51 IST|Sakshi
నిందితులు ఎగ్గిడి రమేష్, అతని అనుచరులు

ప్లాన్‌ బెడిసికొట్టి తమ్ముడే హతం

డబ్బులు మిగులుతాయని చంపేసిన వ్యాపార భాగస్వామి

రియల్టర్‌ సత్తయ్య హత్యలో వెలుగుచూసిన నిజాలు

ముగ్గురు నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడించిన ఏసీపీ యాదగిరిరెడ్డి

యాచారం: అన్నను చంపించేందుకు అతడు పథకం వేశాడు. తన వ్యాపార భాగస్వామికి సుపారీగా కొంత డబ్బు కూడా చెల్లించాడు. సదరు భాగస్వామి వ్యాపారంలో డబ్బులు మిగులుతాయని భావించి చివరికి తమ్ముడినే చంపేశాడు. చౌదర్‌పల్లిలో దారుణహత్యకు గురైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హత్య కేసులో పోలీసులు ముగ్గురి నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి ఓ ప్రకటనలో కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని చౌదర్‌పల్లికి చెందిన అమీర్‌పేట సత్తయ్యకు తన  అన్న బీరప్పకు మధ్య కొన్నేళ్లుగా భూవివాదాలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో సత్తయ్య ఎలాగైన తన అన్నను హత్య చేయాలని పథకం వేశాడు. ఈమేరకు తన రియల్‌ ఎస్టేట్‌ భాగస్వామి అయిన కందుకూరుకు చెందిన ఎగ్గిడి రమేష్‌ సహకారం కోరాడు. సుపారీగా రూ.4 లక్షలు మాట్లాడుకుని అడ్వాన్సుగా రూ. 50 వేలు ఇచ్చాడు. తన అన్నను తొందరగా హత్య చేయాలని ఎగ్గిడి రమేష్‌పై సత్తయ్య ఒత్తిడి తీసుకొచ్చాడు. భూములు, ప్లాట్ల కొనుగోళ్లలో భాగంగా సత్తయ్య వద్ద ఎగ్గిడి రమేష్‌ పెద్దమొత్తంలో డబ్బును అప్పుగా తీసుకున్నాడు.

తాజాగా ఓ డీల్‌లో పెద్దమొత్తంలో వీరి చేతికి డబ్బు అందాల్సి ఉంది. ఈ సమయంలో ఎగ్గిడి రమేష్‌ పథకం వేశాడు. తన భాగస్వామి సత్తయ్యనే హత్య చేస్తే సుపారీగా తీసుకున్న రూ. 50 వేలు, వ్యాపారం కోసం అప్పుగా తీసుకున్న డబ్బులు, చేతికి అందాల్సిన నగదు అంతా తనకే దక్కుతుందని ప్లాన్‌ వేశాడు.  

చంపేసి.. ప్రమాదంగా చిత్రీకరించి..  
ఈక్రమంలో ఈ నెల 18న సాయంత్రం సత్తయ్య.. తన అన్న బీరప్ప పొలం వద్ద ఒంటరిగా ఉన్నాడని, వెంటనే నీ అనుచరులతో వచ్చి అతడిని చంపేయాలని సత్తయ్య రమేష్‌కు ఫోన్‌ చేశాడు. రమేష్‌ ముందస్తు పథకం ప్రకారం.. అమీర్‌పేట సత్తయ్యను హత్య చేయడానికి.. నీవు వెంటనే గునుగల్‌ అటవీ ప్రాంతంలోకి వస్తే మాట్లాడుకుందామని పిలిచాడు. సత్తయ్య వచ్చాక ‘నీవు ముందు బైకుపై వెళ్లు.. మేము వెనుకాలే వస్తామ’ని నమ్మించాడు. ఆ తర్వాత ఎగ్గిడి రమేష్‌ తన అనుచరులైన కందుకూరు మండలం నేదునూర్‌కు చెందిన బాత్క శ్రీశైలం, కందుకూరు నివాసి పిల్లి శేషగిరితో కలిసి కారులో వెళ్లారు.  గునుగల్‌– పెద్దతుల్ల మధ్య అటవీ ప్రాంతంలోని రోడ్డుపై సత్తయ్యను వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన సత్తయ్యను కర్రలు, ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు. అదేరోజు రాత్రి 10:30 గంటలకు సమాచారం అందడంతో ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి,యాచారం సీఐ లింగయ్య తదితరులు వివరాలు సేకరించారు. ఆధునిక సాంకేతికతను వినియోగి.. సత్తయ్యను ఎగ్గిడి రమేష్, అతడి అనుచరులే చంపేసినట్లు గుర్తించారు. ఈమేరకు ముగ్గురు నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు