రియల్టర్‌ ఆత్మహత్య

1 Jun, 2018 13:25 IST|Sakshi
మృతుడు కాట్రగడ్డ శ్రీకాంత్‌

అప్పుల బాధతో అఘాయిత్యం

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

గుణదల (విజయవాడ ఈస్ట్‌) : వ్యాపారంలో నష్టం రావడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ రియల్టర్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం జరిగింది. మాచవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మొగల్రాజపురం అమ్మ కళ్యాణ మండపం ప్రాంతానికి చెందిన కాట్రగడ్డ శ్రీకాంత్‌ (41) కొన్నేళ్లుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. నగరంలో పలు చోట్ల అపార్ట్‌మెంట్లు నిర్మించి క్రయవిక్రయాలు చేస్తున్నాడు. అతనికి భార్య లిఖిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల వ్యాపారంలో తీవ్రంగా నష్టాన్ని చవి చూశాడు.

కొంత మంది పెద్ద మొత్తంలో ఇవ్వాల్సిన నగదు చెల్లించకుండా ఇబ్బందికి గురి చేశారు. కోట్లాది రూపాయల మేర ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో కొంత కాలంగా మానసికంగా కుంగిపోయాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 7 గంటలకు గుడికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు సేకరించిన పోలీసులు తొలుత మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉండగా భవానీపురం కృష్ణానది సమీపంలో ఓ వ్యక్తి మృతి చెందాడని గురువారం భవానీపురం పోలీసులకు సమాచారం అందింది. మృతుడి వద్ద డ్రైవింగ్‌ లైసెన్సు, పాన్‌ కార్డులు సేకరించిన పోలీసులు అతనిని శ్రీకాంత్‌గా నిర్దారించారు. దీంతో మాచవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు.

అప్పులే కారణమా..
నగరంలో రియల్టర్‌గా పలు కన్‌స్ట్రక్షన్స్‌ చేస్తున్న కాట్రగడ్డ శ్రీకాంత్‌ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్యకు పాల్పడేంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా డబ్బులు ఎగ్గొట్టి పరారయ్యారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోట్లాది రూపాయల నష్టం ఎందుకు వాటిల్లింది అనే విషయాలపై కూడా కూపీ లాటుతున్నారు.

శోక సంద్రంలో కుటుంబీకులు..
గుడికని చెప్పి వెళ్లిన శ్రీకాంత్‌ విగత జీవిగా మారడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. తన కుటుంబం రోడ్డున పడిందంటూ మృతుడి భార్య బోరుమని విలపించింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు