సమస్యలతో పోరాడలేను.. శాశ్వతంగా కన్ను మూస్తున్నా!

12 Feb, 2020 07:53 IST|Sakshi
యాదగిరి మృతదేహం ,రియల్టర్‌ యాదగిరి (ఫైల్‌)

ఆర్థిక ఇబ్బందులతో రియల్టర్‌ ఆత్మహత్య

కార్యాలయంలోనే ఉరేసుకునిబలవన్మరణం   

వ్యాపార భాగస్వాముల మోసమే కారణమా?

చైతన్యపురి: ‘తప్పులు సరిచేసుకుంటూ జీవితంలో ఒంటరి పోరాటంతో ముందుకు పోతుంటే.. ఓపిక నశించింది.. ఫలితాలు తీసుకునే సమయంలో సమస్యలు పెరిగిపోతున్నాయి.. నన్ను చాలా మంది వాడుకున్నారు.. అబద్ధాలు ఆడే ఓపిక నాకిక లేదు.. ఈ సమస్యల నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా’నంటూ ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి తన కార్యాలయంలోనే ఉరేసుకుని బలవర్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కథనం ప్రకారం.. నకిరేకల్‌ చిత్తలూరుకు చెందిన ఎద్దు యాదగిరి (55) హైదరాబాద్‌కు వచ్చి నాగోలులో షణ్ముఖ మార్కెటింగ్‌ సర్వీసెస్‌ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. సమతాపురి కాలనీలో నివసించే ఆయనకు భార్య జ్యోతి, కుమారుడు పవన్‌ సాయి, కూతురు నిఖిత ఉన్నారు.

కుమారుడు పవన్‌ సాయి పదిరోజుల క్రితమే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాడు.  మంగళవారం ఉదయం 7.30 గంటలకు కార్యాలయానికి వచ్చిన యాదగిరి తన సెల్‌ఫోన్‌లో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో రికార్డు చేసి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటరి పోరాటం చేస్తున్నాను. సమస్యలతో పోరాడలేను... శాశ్వతంగా చనిపోతున్నానని ఫోన్‌లో రికార్డు చేసి కుటుంబ సభ్యులకు విషయం తెలిపాడు. ఉదయం 9 గంటలకు కార్యాలయానికి చేరుకున్న కుటుంబ సభ్యులకు యాదగిరి ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. వ్యాపార భాగస్వాములు మోసం చేయటం వల్లే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కూతురు నిఖిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు