దుంగల దొంగలు!

26 May, 2018 12:24 IST|Sakshi

యధేచ్ఛగా  ప్రకృతి సంపద కొల్లగొడుతున్నారు

రైల్వేకోడూరు, రాజంపేటల్లో అధికమవుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్‌

ప్రత్యక్ష పాత్ర పోషించిన టీడీపీ జడ్పీటీసీ సోదరుడు శివయ్య

అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరు పర్చిన పోలీసులు

రిమాండ్‌కు తరలించిన కోర్టు

సాక్షి ప్రతినిధి, కడప: ‘ఎర్రచందనం అక్రమార్జన మాకే సొంతం. మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోకుడదు.చూసీ చూడనట్లు వెళ్లాలి. అలా అయితేనే పోస్టింగ్‌లో కొనసాగుతారు.’ అచ్చం ఇలాగే తెలుగుతమ్ముళ్లు వ్యవహరిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే అధికారం అడుగులకు మడుగులకు ఒత్తేపనిలో కొందరు అధికారులు నిమగ్నమయ్యారు. ఈకోవలోనే 9నెలల కిందట కేసు నమోదైనప్పటికీ జడ్పీటీసీ సోదరుడుని అదుపులోకి తీసుకోలేపోయారు. ఎట్టకేలకు అరెస్టు చేసినపోలీసులు కోర్టుకు హాజరుపర్చి గుట్టుచప్పుడు కాకుండా రిమాండ్‌కు పంపిన వైనమిది.

తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గాదెల కేంద్రంగా ఎర్రచందనం అక్రమ రవాణా విచ్చలవిడిగా కొనసాగింది. ఓబులవారిపల్లె జడ్పీటీసీ నాడుడోరి రమణ సోదరుడు నాయుడోరి శివయ్య దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే తలంపుతో ముందుచూపుతో వ్యవహరించారు. ప్రకృతి సంపద ఎర్రచందనంపై దృష్టి సారించారు. ఆపై అడవులపైబడి విచ్చలవిడిగా విజృంభన చేశారు. ఈక్రమంలో గాదెల గ్రామంలో రూ.2కోట్ల విలువైన ఎర్రచందనం డంప్‌ బహిర్గతమైంది. అందుకు ముందు మూడునెలల క్రితం   రూ.3కోట్లు విలువైన డంప్‌ కూడా పట్టుబడింది. ఈమొత్తం స్మగ్లింగ్‌ దుంగలు నాయుడోరి శివయ్యకు చెందినవిగా అప్పట్లో ఆప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగింది. అయినప్పటీకీ పోలీసులు శివయ్యను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడం,అరెస్టు చేయడం లాంటి చర్యలు చేపట్టలేదు. క్రైం నెంబర్‌ 201/2017 కింద కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. పైగా రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలో ఎక్కడ ఎర్రచందనం పట్టుబడ్డ బడా స్మగ్లర్‌ గంగిరెడ్డి అనుచరులంటూ ప్రకటనలు గుప్పించడం జారుకోవడం మినహా అసలు స్మగ్లర్లుకు గేట్లు ఎత్తేశారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా రిమాండ్‌....
ఓబులవారిపల్లె జడ్పీటీసీ నాయుడోరి రమణ సోదరుడు శివయ్యను మూడు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి నిర్ధారణ తర్వాత కోర్టుకు హాజరుపర్చి రిమాండ్‌కు పంపారు.  చిన్నాచితక స్మగ్లర్లను అరెస్టు చేస్తే పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటాలకు పోయే యంత్రాంగం టీడీపీ జడ్పీటీసీ సోదరుడు విషయంలో గుట్టు చప్పుడు కాకుండా వ్యవహరించడం ఆశ్చర్యకరంగా ఉందని పలువురు వివరిస్తున్నారు. గతంలో గాదెల గ్రామంలో దాదాపు రూ.5కోట్ల విలువైన దుంగల డంప్‌లు లభ్యమయ్యాయి.

ఆదే గ్రామానికి చెందిన శివయ్య అరెస్టు నేపథ్యంలో ఆ డంప్‌లు ఎవ్వరివి? ఎక్కడి నుంచి తెచ్చారు? చందనం చెట్టును నరికి  డంప్‌లోకి చేర్చిన వారెవరు? ఎంతకాలంగా స్మగ్లింగ్‌తో సంబంధాలున్నాయి. ఇలాంటి ప్రశ్నలకు జవాబులు వెలికి తీయకుండా కేసులోని నిందితుడు అరెస్టు చూపెట్టారు. పోలీసు యంత్రాంగం అరెస్టు పెండింగ్‌లో లేకుండా చూసుకోవడం, పెండింగ్‌లో ఉంటే ఉన్నతాధికారుల ప్రశ్నించే అవకాశం ఉడండడంతోనే గుట్టుచప్పుడు కాకుండా నాయుడోరి శివయ్య వ్యవహారంలో కోర్టుకు హాజరుపర్చినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

కళంకితులకు బాధ్యతలు..!
ఎర్రచందనం పరిరక్షణకు ప్రత్యేక విభాగాన్ని ప్రవేశ పెడుతున్నాం. టాస్క్‌ఫోర్సు విధులు నిర్వర్తిస్తుందని ఉన్నతాధికారులు ప్రకటించారు.అలాంటి విధుల్లో నీతి, నిజాయితీ ఉన్న అధికారులు బాధ్యతలు నిర్వర్తిస్తే, అసలు లక్ష్యం సాధించే అవకాశం ఉంది. టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న కొందరు అధికారులు కళంకితులుగా మిగిలారు. స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకొని అక్రమార్జనకు రుచి మరిగారు. ఈక్రమంలో టాస్క్‌ఫోర్స్‌ స్థానంలో ‘టాక్స్‌’ఫోర్స్‌ అధికారులు వచ్చి చేరారు. అధికారపార్టీ నేతలతో టాక్స్‌(మాటలు) నిర్వహించడం, ప్రత్యర్థుల్ని కేసుల్లో ఇరికించడం ఒకటైతే, ముడుపులు ముట్టజెప్పినవారిని వదిలేసి చేతులు దులుపుకోవడం మరొక ఎత్తుగా వ్యవహరించారని పలువురు వివరిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌ వింగ్‌లో కొత్తగా విధుల్లో చేరిన అధికారులకు బాధ్యతలు అప్పగిస్తే ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుందని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. అలాంటివారు అడువుల్ని రక్షించడమే ధ్యేయంగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుందని వెల్లడిస్తున్నార. అలా కాకుండా డక్కీమొక్కీలు తిన్న యంత్రాంగానికి బాధ్యతలు అప్పగిస్తే టాస్క్‌ఫోర్స్‌ స్థానంలో ‘టాక్స్‌’ఫోర్స్‌ ఏర్పడక తప్పదని పలువురు వివరిస్తున్నారు. ఉన్నతాధికారులు గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న, ట్రాక్‌ రికార్డు బాగలేని అధికారుల్ని తప్పించి సచ్ఛీరులకు బాధ్యతలు అప్పగించడం శ్రేయష్కరమని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు