స్మగ్లింగ్‌కు 'రెడ్‌' సిగ్నల్‌ 

22 Oct, 2019 04:53 IST|Sakshi

ఎర్ర చందనం ఎగుమతులకు అనుమతిచ్చిన కాలంలో తగ్గిన స్మగ్లింగ్‌

పదేళ్ల గణాంకాలు చెబుతున్న వాస్తవాలివీ

సాక్షి, అమరావతి: ఎర్ర చందనాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తే స్మగ్లింగ్‌ తగ్గుతోంది. ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వని కాలంలో మాత్రం అక్రమ రవాణా భారీగా పెరిగిపోతోంది. ఎర్ర చందనంతో తయారుచేసిన వస్తువుల్ని కలిగి ఉండటాన్ని చైనా, జపాన్‌ దేశాల్లో సంపన్నులు స్టేటస్‌ సింబల్‌గా, శుభప్రదంగా భావిస్తుంటారు. అందువల్ల ఎర్ర చందనం దుంగలకు ఆ దేశాల్లో డిమాండ్‌ ఎక్కువ.

మన రాష్ట్రం నుంచి ఆ దేశాలకు అధికారికంగా ఎర్ర చందనం ఎగుమతి చేస్తే స్మగ్లర్లను ఆశ్రయించి కొనుగోలు చేయాల్సిన అవసరం అక్కడి వ్యాపారులకు ఉండదు. దీనివల్ల స్మగ్లింగ్‌ తగ్గిపోతోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కలపను ఎగుమతి చేయని సమయంలో అక్కడి వ్యాపారులు స్మగ్లర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో స్మగ్లర్లు శేషాచలం అటవీ ప్రాంతంలోని ఎర్రచందనం చెట్లను నరికించి అక్రమ మార్గాల్లో చైనా, జపాన్‌ దేశాలకు దొడ్డిదారిన ఎగుమతి చేస్తున్నారు.

ఆ సంవత్సరాల్లో భారీగా స్మగ్లింగ్‌..
2009–10 నుంచి 2013–14 వరకూ ఎర్రచందనం ఎగుమతి చేయలేదు. దీంతో ఆ కాలంలో చైనా, జపాన్‌ దేశాలకు భారీగా స్మగ్లింగ్‌ జరిగింది. ఆ సంవత్సరాల్లో అటవీ శాఖ అధికారులు దాడులు చేసి అధిక పరిమాణంలో ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ సంవత్సరాల్లో ఎక్కువ స్మగ్లింగ్‌ జరిగినందునే దాడుల్లో ఎక్కువ కలప దొరికిందని అటవీ శాఖ అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2005–06 నుంచి గణాంకాలు పరిశీలిస్తే చట్టబద్ధంగా ఎర్రచందనం ఎగుమతులు చేసిన సంవత్సరాల్లో స్మగ్లింగ్‌ తక్కువగా ఉంది.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి సర్కారు ఎర్రచందనం ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చింది. అప్పట్లో స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకుని అటవీ శాఖ గిడ్డంగుల్లో దాచి ఉంచిన ఎర్ర చందనం దుంగల్ని 2014–15 నుంచి 2018–19 వరకూ ఏటా అటవీ శాఖ  టెండర్ల ద్వారా విక్రయించి విదేశాలకు తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించింది. దీంతో ఆ సంవత్సరాల్లో అక్రమ రవాణా తగ్గిపోయింది. ఆయా సంవత్సరాల్లో అటవీ శాఖ దాడుల్లో దొరికిన కలప, నమోదైన కేసులు తక్కువగా ఉండటం స్మగ్లింగ్‌ తగ్గిందనడానికి నిదర్శనమని అటవీశాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.

దేశంలోనే అరుదైనది
దేశంలోనే అరుదైన ఎర్ర చందనం వృక్ష సంపద మన రాష్ట్రంలోని చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 5.83 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. నల్లమల కొండల్లో ఎర్ర చందనం అధికంగా లభ్యమవుతోంది. ఈ వృక్షాల పెరుగుదలకు ఈ ప్రాంతం అనువైనది కావడమే ఇందుకు కారణం. 

అనుమతి కోసం కేంద్రానికి వినతి
చైనా, జపాన్‌ దేశాలకు ఎర్ర చందనం ఎగుమతి చేసిన కాలంలో స్మగ్లింగ్‌ తగ్గిపోయింది. స్మగ్లింగ్‌ కట్టడి కోసం ఏటా వెయ్యి టన్నుల ఎర్ర చందనాన్ని విక్రయించి.. విదేశాలకు ఎగుమతి చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి త్వరలో విజ్ఞప్తి చేయనుంది.
– ప్రతీప్‌కుమార్, రాష్ట్ర అటవీ దళాల అధిపతి

మరిన్ని వార్తలు