శవ పంచాయితీ

10 Sep, 2019 11:15 IST|Sakshi

తమకు తెలియకుండా అంత్యక్రియలు చేశారని బంధువుల ఫిర్యాదు  

ఛీటింగ్‌ కేసు నమోదు

చిలకలగూడ : తమకు తెలియకుండా అంత్యక్రియలు నిర్వహించారని బంధువుల ఫిర్యాదు మేరకు ఛీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చిలకలగూడ మైలార్‌గడ్డకు చెందిన లక్ష్మీనారాయణ ఈశ్వర్‌చంద్‌కు ముగ్గురు అక్కలు, ఒక సోదరుడు ఉన్నారు. పెద్ద సోదరి తారాబాయి భర్త మనోహర్‌రెడ్డి (70) అస్వస్తతకు గురికావడంతో ఈనెల 1న ముషీరాబాద్‌ కేర్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. చికిత్స పొందుతూ 5న మృతి చెందాడు. అదేరోజు అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని సీతాఫల్‌మండి శ్మశానవాటికకు తీసుకురాగా, మృతుడి సమీప బంధువైన అయుష్‌రెడ్డి అక్కడికి  వచ్చి అంత్యక్రియలు చేయరాదంటూ అడ్డుకున్నాడు.

మృతుని సోదరి ఉషారాణి బోపాల్‌ నుంచి వచ్చేవరకు దహన సంస్కారాలు చేయరాదని మరుసటి రోజు ( 6వ తేదీ) అంత్యక్రియలు నిర్వహిస్తామని చెబుతూ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించాడు. 6న ఉదయం బంధువులు సీతాఫల్‌మండి స్మశానవాటికకు రాగా ఆయుష్‌రెడ్డి ఎంతకూ రాకపోయేసరికి బంధువులంతా గాంధీ మార్చురీకి వెళ్లారు. అక్కడ ఆయుష్‌రెడ్డి మరోమారు అసభ్యపదజాలంతో దూషించడమేగాక ఎవరికీ చెప్పకుండా మృతదేహాన్ని మరో స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించాడు. దీంతో మృతుని బావమరిది లక్ష్మీనారాయణ ఈశ్వర్‌చంద్‌ పోలీసులను ఆశ్రయించడంతో ఆయుష్‌రెడ్డిపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు