పగలు భక్తులు... రాత్రికి దొంగలు!

13 Jul, 2019 09:55 IST|Sakshi

సాక్షి, కడప : ఒంటిమిట్ట మండలం కొత్తమాదరవరం గ్రామానికి చెందిన కొందరు బంధువులు ఓ ముఠాగా ఏర్పడి గుడి దొంగలుగా మారారు. ప్రధాన నిందితుడు నగులూరి ఆదినారాయణ నేతృత్వంలో అతని సోదరుడు ఈశ్వరయ్య గుళ్లు, ఇళ్లల్లో చోరీలు చేస్తూ 2017లో కడప పోలీసులకు చిక్కారు. గతేడాది ఫిబ్రవరిలో ఈశ్వరయ్య, మేలో ఆదినారాయణ కడప సెంట్రల్‌ జైలు నుంచి బయటకు వచ్చారు. కటకటాల్లోకి వెళ్లి వచ్చినా తమ పంథా మార్చుకోని వారు విలాసవంతమైన జీవితం కోసం తమ గ్రామానికే చెందిన బంధువులతోనే ముఠా కట్టారు.

ఇలా గురునాథం ఆంజనేయులు, నగులూరి ఏసయ్య, ఏసురత్నం,అంజయ్యలతో కలిసి రంగంలోకి దిగారు. తొలుత వీరంతా టార్గెట్‌ చేసుకున్న ప్రాంతాలకు కుటుంబంతో సహా వెళ్లి రోడ్డు పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశాల్లో గుడారాలు వేసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో ఉదయం పూట పురుషులు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ, మహిళలు స్టీలు వస్తువుల మార్పిడి, సవరాలకు అవసరమైన వెంట్రుకలు ఖరీదు చేస్తామంటూ వీధుల్లోకి వెళ్తారు.

ఇలా వారున్న ప్రాంతంలోని దేవాలయాలు, వాటిలో ఉన్న భద్రతా ఏర్పాట్లు, ఆ పరిసరాలను రెక్కీ చేస్తారు. ఆపై ఎంపిక చేసుకున్న గుడిలోకి వెళ్లి ఓ సారి అంతా తమదైన శైలిలో నిర్థారణ చేసుకున్నాక.. కొన్ని రోజుల తర్వాత ఆ ముఠా మొత్తం రాత్రి సమయంలో ఆ గుడి వద్దకు వెళ్తుంది. తలుపులు పగులగొట్టి  హుండీ ఎత్తుకుపోవడమో, దాన్ని బద్దలుగొట్టి అందులో ఉన్న డబ్బు పట్టుకుపోవడమో చేస్తుంది. దీంతో పాటు ఆ గుడిలో లభించిన ఇతర వెండి, బంగారు వస్తువులు, ఆభరణాలను కూడా చోరీ చేస్తారు.

షాద్‌నగర్‌ దొంగతనంతో...
ఈ గ్యాంగ్‌ ఇప్పటి వరకు తెలంగాణలోని సైబరాబాద్, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణ్‌పేట్, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల్, ఆంధ్రప్రదేశ్‌లో కడప, చిత్తూరు, కర్ణాటకలోని చిక్కబల్లాపూర్, కోలార్‌ల్లో మొత్తం 50 చోరీలు చేసింది. సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని షాద్‌నగర్‌లో ఒకే రోజు నాలుగు హుండీలను ఎత్తుకెళ్లింది. దీంతో శంషాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు రంగంలోకి దిగారు.

ఆయా దేవాలయాలతో పాటు చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను పరిశీలించారు. ఓ చోట అనుమానితుల ద్విచక్ర వాహనం నంబర్‌ చిక్కింది. దీని ఆధారంగా ముందుకు వెళ్లిన పోలీసులు దాదాపు మూడు రాష్ట్రాల్లోనూ గాలించారు. ఎట్టకేలకు ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.రెండు లక్షల విలువ చేసే ఆరు తులాల బంగారు ఆభరణాలు, రూ.1.25 లక్షల విలువ చేసే వెండి ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా