పురివిప్పిన పాతకక్షలు

11 Dec, 2017 12:56 IST|Sakshi

పట్టపగలు ఇద్దరి దారుణ హత్య

అదును చూసి వెంటాడి గొంతకోసి చంపిన బంధువులు

గూడూరులోని ఇందిరానగర్‌లో ఘటన

పోలీసుల అదుపులో కొందరు నిందితులు  

గూడూరు: పాత కక్షలు పురివిప్పాయి... అదను కోసం కాపుకాసిన బంధువులు మారణాయుధాలతో వెంటాడి.. అతి కిరాతకంగా చిన్న జయరామయ్య(30), డేగా పెద్ద జయరామయ్య (32) అనే ఇద్దరిని గొంతుకోసి, నరికి చంపిన దారుణ ఘటన గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఇందిరానగర్‌లో ఆదివారం జరిగింది. ఈ జంట హత్యలతో ఆ ప్రాంతం భీతిల్లింది. వివరాల మేరకు..  పందులు మేపుకుంటూ జీవనం సాగించే దొమ్మరి సామాజిక వర్గానికి చెందిన సమీప బంధువులైన డేగా రామయ్య, డేగా చెంగయ్య కుటుంబాలకు పాత కక్షలు ఉండేవి. ఈ ఏడాది జూలై 5న  డేగా చెంగయ్య కుమారుడు నారాయణ పందులను మేతకు తోలుకెళ్తున్నాడు. ఈ క్రమంలో డేగా రామయ్యతో కలిసి అతని తమ్ముడు చిన కోటయ్య, కొడుకులు చిన్న జయరామయ్య, పెద్ద జయరామయ్య, బాబు, కాపుకాసి నారాయణను హతమార్చారు. దీంతో పోలీసులు చిన్న, పెద్ద జయరామయ్యలు, బాబు, తండ్రి రామయ్య, చిన్నాన్న చిన్న కోటయ్యలైన ఐదుగురిపై హత్య కేసు నమోదు చేయడంతోపాటు, రౌడీ షీట్లు కూడా తెరిచారు. ఆ రెండు కుటుంబాల మధ్య మళ్లీ ఘర్షణలు పునరావృతమై హత్యలకు దారితీయకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా వారిని ఊరు విడిచి వెళ్లిపోవాలని చెప్పడంతో, వారు కోట మండలం విద్యానగర్‌కు కాపురం వెళ్లాపోయారు. ఈ క్రమంలో గత శుక్రవారం రామయ్య ఇల్లు కాలిపోవడంతో, చిన్న, పెద జయరామయ్యలు, సోదరుడు బాబు, వారి భార్యాపిల్లలు గూడూరుకు వచ్చారు.  

అదును చూసి హత్యచేశారు..  
ఇదే అదును కోసం కాపుకాసి ఉన్న డేగా చెంగయ్య బంధవులు రమేష్, శీను, చింతాలు, కాంతారావుతో ఇంకొందరు మహిళలు.. ఇంటి పనులు చేసుకుంటున్న చిన్న జయరామయ్య, పెద్ద జయరామయ్యలతోపాటు, వారి కుటుంబ సభ్యులపై కారప్పొడి చల్లి దాడికి పాల్పడ్డారు. సోదరులు చిన్న పెద్ద జయరామయ్యలను విచక్షణా రహితంగా గొంతు కోసి, ముఖంపై కత్తులతో పోట్లు పొడిచి గుర్తుపట్టలేనంతగా హత్యచేశారు. ఈ దాడిలో సోదరులిద్దరూ మృతి చెందగా, పెద్ద జయరామయ్య భార్య చినక్క,  అత్త పూజారి రామమ్మ తీవ్రంగా గాయపడ్డారు. అయితే సోదరులతోపాటు వచ్చిన బాబు అప్పుడే వెళ్లిపోవడంతో తప్పించుకున్నాడు. లేదంటే అతన్ని కూడా మట్టుపెట్టేవారని బంధువులు  విలపించారు. 

పోలీసుల అదుపులో కొందరు నిందితులు  
ఈ మేరకు సమాచారం అందుకున్న గూడూరు డీఎస్పీ వీఎస్‌ రాంబాబు, పట్టణ సీఐ టీవీ సుబ్బారావులతోపాటు ఎస్సై బాబి ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగినట్లు తెలుసుకున్న మృతుల బంధువులు అక్కడికి చేరుకుని మృత దేహాల వద్ద బోరున విలపించారు.  తమ వారిని హత్య చేసిన వారిని కూడా చంపేస్తామంటూ బయలుదేరబోగా డీఎస్పీ వారిని వారించారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి మృతుని భార్య చిన్నక్క నుంచి వివరాలు సేకరించారు. దారుణ హత్యలకు పాల్పడ్డ వారిలో కొందరు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు