సత్ప్రవర్తనతో మెలగాలి

24 Apr, 2018 11:06 IST|Sakshi
సమావేశంలో పాల్గొన్న వారు.. మాట్లాడుతున్న ఎస్పీ రెమా రాజేశ్వరి

క్షణికావేశమే మన శత్రువు  

మీలో మార్పు..  మీ కుటుంబానికి ఎంతో మేలు  

సత్ప్రవర్తనతో ఉంటే  కేసులు తొలగిస్తాం  

పాత నేరస్తులతో  ఎస్పీ రెమారాజేశ్వరి  

గద్వాల క్రైం:  పాతకక్షలకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. సోమవారం గద్వాల డీఎస్పీ కార్యాలయం ఆవరణలో పాత నేరస్తులు, రౌడీషీటర్లతో  ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గద్వాల, గట్టు, ధరూర్, అయిజ, శాంతినగర్, ఉండవెల్లి, రాజోళి, మల్దకల్‌ తదితర మండలాల్లో 166మందిపై రౌడీషీట్‌ నమోదు అయ్యిందని తెలిపారు. గతంలో ఉన్న గొడవలు, పాతకక్షలు మనస్సులో పెట్టుకొని తోటి స్నేహితులు, రక్త సంబంధీకులు ఇరుగు పొరుగు వారితో క్షణికావేశంలో ఘర్షణ పడటం తగదన్నారు. ఈ క్రమంలోనే హత్యలు చేస్తున్నారని, లేదా తీవ్రంగా గాయపడి వైకల్యంతో బాధపడుతున్నా రని అన్నారు. దీనివల్ల బాధిత కుటుంబా లు రోడ్డున పడుతున్నాయని, తల్లిదండ్రులకు, పిల్లలకు దూరమవుతున్నారని చెప్పారు. ఆవేశాన్ని అదుపులో పెట్టుకోగలిగితే ఎలాంటి అనర్థాలు రావని చెప్పా రు. ఇకనుంచి సమాజంలో సత్ప్రవర్తనతో జీవించాలని సూచిం చారు. మీలో మార్పు వస్తే మొదట మీ కుటుంబమే బాగుపడుతుందని చెప్పారు.

సత్ప్రవర్తన కలిగిన నేరస్తులపైకేసులు తొలగిస్తాం  
మద్యం, జూదం, మాట్కా, హత్యలు, కిడ్నాప్‌లు, దొంగతనాలు, ఇతర నేరా లకు చోటివ్వకుండా సత్ప్రవర్తనతో జీవించే వారిపై కేసులు తొలగిస్తామని ఎ స్పీ చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా ఉందని తెలిపారు. పోలీసులు ఎప్పటికప్పుడు మీ ప్రవర్తనపై నిఘా ఉంచి, ఉన్నతాధికారులకు మీ వివరాలు అందిస్తారన్నారు. అనంతరం గద్వాల డీఎస్పీ సురేందరావు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. గ్రామ, పట్టణంలో సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులకు ప్రభుత్వం నుంచి ఉపాధి అవకాశాలు అందించి, వారి అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీఐలు, వెంకటేశ్వర్లు, రజిత, వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు విజయ్, మురళీధర్‌గౌడ్, మదుసూదన్‌రెడ్డి, మహేందర్, వెంకటేశ్వర్లు, నవీన్‌సింగ్, పర్వతాలు, ప్రవీణ్, జగదీశ్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు