పరారీ నిందితుడి కోసం వెళితే

6 Aug, 2018 10:44 IST|Sakshi
పోలీసుల అదుపులో ఉన్న రిమాండ్‌ నిందితునితోపాటు మరో ఇద్దరు నిందితులు

మరో ఇద్దరు దొరికారు

ధర్మవరం అర్బన్‌: పరారీలో ఉన్న రిమాండ్‌ నిందితుడి కోసం వెళితే మరో ఇద్దరు నిందితులు కూడా పోలీసులకు పట్టుబట్టారు. వివరాల్లోకి వెళితే... బత్తలపల్లి మండలం రామాపురం వద్ద జీవిస్తున్న సంచారజీవుల మధ్య 2017 డిసెంబర్‌ 4న గొడవలు జరగడంతో షికారి రోహి అలియాస్‌ రవి, ఆయన సోదరుడు శ్రీకాంత్‌లు శ్రీనివాసులు దంపతుల గొంతులు కోశారు. ఈ ఘటనలో శ్రీనివాసులు మృతి చెందగా భార్య ప్రాణాలతో బయటపడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు షికారి రోహిని మూడునెలల క్రితం బద్వేలు వద్ద అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌ విధించారు. ధర్మవరం సబ్‌జైలులో ఉన్న రిమాండ్‌ నిందితుడు షికారి రోహిని జూలై 17న బత్తలపల్లి పోలీసులు బాలకృష్ణ ఎస్కార్ట్‌తో ధర్మవరం కోర్టుకు తరలించారు. కోర్టులో పోలీసుల కళ్లుగప్పి షికారి రోహి పారిపోయాడు. ఎలాగైనా అతడిని పట్టుకోవాలని ధర్మవరం, బత్తలపల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు నిందితున్ని పట్టుకునేందుకు పక్కా ప్రణాళిక వేశారు. దీంతో పోలీసు బృందం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలో నిందితుని కోసం గాలించారు. షికారి రోహి స్వస్థలం అయిన మహారాష్ట్రలోని నాందేడ్‌జిల్లా ముఖేడ్‌ తాలూకాలో ఉన్నట్లు సమాచారం అందింది. పోలీసులు పక్కా వ్యూహంతో నిందితుడు షికారి రోహి ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. షికారి రోహితోపాటు అదే హత్య కేసులో ఉన్న అతని సోదరుడు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు కడప జిల్లా బద్వేల్‌ ప్రాంతంలో వివిధ కేసుల్లో ఉన్న మరో నిందితుడు వెంకటేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒకరి కోసం వెళితే మరో ఇద్దరు నిందితులు దొరకడంతో పోలీసు యంత్రాంగం ఊపిరిపీల్చుకున్నట్లు అయింది. పరారైన రిమాండ్‌ నిందితుడు షికారి రోహి, అదే హత్య కేసులో నిందితుడు శ్రీకాంత్, మరో కేసులో నిందితుడు వెంకటేష్‌లను పట్టుకున్నందుకు ప్రత్యేక పోలీసు బృందం కానిస్టేబుళ్లు వేణుగోపాల్, భాస్కర్‌నాయుడు, బాలకృష్ణలను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. నిందితులను సోమవారం బత్తలపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకురానున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు