పోలీసులు కొట్టిన దెబ్బలకే రిమాండ్‌ ఖైదీ మృతి

3 May, 2018 06:57 IST|Sakshi
మార్చురి వద్ద నిరసన తెలియచేస్తున్న యానాది సమాఖ్య నాయకులు ( ఇన్‌సెట్‌ ) గంగయ్య మృతదేహం

మార్చురి వద్ద యానాది సమాఖ్యనాయకుల నిరసన

సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్‌

పోస్ట్‌మార్టం వాయిదా

గుంటూరు ఈస్ట్‌: రిమాండ్‌ ఖైదీ మృతికి కారణమయిన పోలీసులపై చర్యలు తీసుకుని   కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని జీజీహెచ్‌ మార్చురి వద్ద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర యానాది సమాఖ్య నాయకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. దీంతో మృతుడి  పోస్టుమార్టం గురువారానికి వాయిదా పడింది. ఈ సందర్భంగా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీరాములు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా చీమకుర్తి సిద్ధార్థనగర్‌లో నివసించే ఎనిమిది మంది ఎస్సీ,ఎస్టీలను దారి దోపిడీ అనుమానంపై   పోలీసులు మార్చి 30వ తేదీ అదుపులోకి తీసుకున్నారన్నారు. విచారణ సమయంలో వారిని తీవ్రంగా కొట్టడంతో రిమాండుకు తరలించిన అనంతరం మన్నెం చిన గంగయ్య (20) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని చెప్పారు. ఏప్రిల్‌ 30వ తేదీ జీజీహెచ్‌కు తరలించారన్నారు. చికిత్స పొందుతూ చిన గంగయ్య అదే రోజు రాత్రి మృతి చెందాడని వివరించారు. దీనిపై సిట్టింగ్‌ జడ్జి, వైద్యుల బృందం పర్యవేక్షణలో శవపరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

పక్షపాతం లేకుండా విచారణ జరిపి చిన గంగయ్య మృతికి కారణమయిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుడి కుటుంబానికి రూ. 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. రిమాండులో ఉన్న మిగిలిన వారందిరికీ వెంటనే వైద్య పరీక్షలు చేయించి చికిత్స జరిపించాలని కోరారు. చిన గంగయ్య సోదరుడు అంకమ్మరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, అతనికి ప్రత్యేక వైద్యం చేయించి ప్రాణాలు పోకుండా కాపాడాలని డిమాండ్‌ చేశారు. నిరసనలో సమాఖ్య నాయకులు మేకల ఏడుకొండలు, అద్దంకి అంకారావు, కె.ఏడుకొండలు , ఖాజారావు, ఖాజావలీ, జి.శ్రీను పాల్గొన్నారు. ఒంగోలు ఆర్డీవో శ్రీనివాసరావు మార్చురీ వద్ద పరిస్థితిని పర్యవేక్షించారు. దీంతో చిన గంగయ్య మృతదేహానికి గురువారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు