పోలీసుల కళ్లుగప్పి

20 Mar, 2018 11:38 IST|Sakshi

రిమాండ్‌ ఖైదీ పరారీ

నెల్లూరు(క్రైమ్‌): ఎస్కార్ట్‌ పోలీసుల కళ్లు గప్పి రిమాండ్‌ ఖైదీ పరారైన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు పలు కేసుల్లో మోస్ట్‌వాంటెడ్‌ కావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాలు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లింగేశ్వరనగర్‌కు చెందిన నిమ్మల హరీష్‌ అలియాస్‌ హరి చిన్నతనం నుంచే దొంగతనాలకు అలవాటుపడ్డాడు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. గుంటూరు జైల్లో ఉన్న సమయంలో హైదరాబాద్‌ అంబర్‌పేటకు చెందిన విజయకుమార్‌ అలియాస్‌ విక్కీ అలియాస్‌ రెడ్డితో పరిచయమైంది. జైలు నుంచి బయటకొచ్చిన వారు కార్లలో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడేవారు. నిందితులు ఇటీవల కడప పోలీసులకు చిక్కారు. పోలీసుల విచారణలో నెల్లూరు బాలాజీనగర్‌లో 2017లో ఓ ఇంట్లో దొంగతనం చేసినట్లు నిందితులు నేరం అంగీకరించారు. అప్పటి నుంచి నిందితులు తిరుపతి స్పెషల్‌ సబ్‌జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల పదిన నెల్లూరు బాలాజీనగర్‌ పోలీసులు నిందితులను దొంగతనం కేసులో విచారించేందుకు తిరుపతి స్పెషల్‌ సబ్‌జైల్‌ నుంచి నెల్లూరు కోర్టుకు తీసుకొచ్చారు.

కోర్టు రిమాండ్‌ విధించడంతో అదే రోజు జిల్లా కేంద్రకారాగారానికి తరలించారు. అనంతరం కోర్టు అనుమతితో 14వ తేదీన హరీష్, విజయకుమార్‌ను బాలాజీనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి 15వ తేదీన జిల్లా కేంద్రకారాగారానికి తరలించారు. ఈ నేపథ్యంలో తిరుపతి నగరంలోని తిరుచానూరు పోలీసులు  దొంగతనం కేసులో విచారించేందుకు పీటీ వారెంట్‌పై హరీష్‌ను మరో రిమాండ్‌ ఖైదీని నెల్లూరు కేంద్రకారాగారం నుంచి ఈ నెల 16న తీసుకెళ్లారు. 17వ తేదీన నిందితులను ప్రాపర్టీ రికవరీ కోసం తిరుపతిలోని పద్మావతిపురానికి తీసుకెళ్లగా, శ్రీహరిమెస్‌ వద్ద పోలీసుల కళ్లుగప్పి హరీష్‌ పరారయ్యాడు. దీనిపై ఎస్కార్ట్‌ పోలీసులు అదే రోజు తిరుచానూరు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. రిమాండ్‌ ఖైదీ పరారైన ఘటనపై తిరుచానూరు పోలీసులు ఈ నెల 18న నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారానికి సమాచారం అందించారు. నిమ్మ ల హరీష్‌పై తిరుపతిలో 12, మదనపల్లి, చిత్తూరు, కడపల్లో నాలుగు పెండింగ్‌ వారెంట్లు ఉన్నాయి.

మరిన్ని వార్తలు