తహసీల్దార్‌ను తొలగించండి

26 Jun, 2018 11:00 IST|Sakshi
వినతి పత్రం అందుకుని వాగ్వాదానికి దిగిన తహసీల్దార్‌  

జయపురం : జయపురం తహసీల్దార్‌ రంజిత మల్లిక్‌ను పదవి నుంచి తొలగించి, అరెస్ట్‌ చేయాలని కమ్యూనిస్ట్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద జిల్లా కమ్యూనిస్ట్‌ పార్టీ కార్యదర్శి జుధిష్టర్‌ రౌళో, రాష్ట్ర సీపీఐ కార్యవర్గ సభ్యులు ప్రమోద్‌ కుమార్‌ మహంతి, జిల్లా సహాయ కార్యదర్శి రామకృష్ణ దాస్‌ల నేతృత్వంలో సోమవారం ఆందోళనలు చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కలెక్టర్, సబ్‌ కలెక్టర్‌ నిరాకరించినా తహసీల్దార్‌ క్వారీలకు అనుమతినిచ్చి ఇద్దరి మరణాలకు కారణమయ్యారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జుధిష్టర్‌ రౌళో మాట్లాడుతూ..కొరాపుట్‌ జిల్లా ప్రజల అమాయకత్వాన్ని అధికారులు తమ స్వలాభం కోసం వినియోగించుకుంటున్నారని ఆరోపించారు.

క్వారీ సంఘటనలో ఇద్దరు ఆపరేటర్లు మరణానికి పరోక్షంగా జయపురం తహసీల్దార్‌ కారకులని ఆయన ఆరోపించారు. క్వారీ లీజ్‌కు అనుమతులు ఇవ్వొద్దని కొరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ జయపురం తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసినా వాటిని బేఖాతరు చేసి తహసీల్దార్‌ క్వారీకి అనుమతులు ఇచ్చారన్నారు. రాణిగుడ సమీపంలోని బొరిపుట్‌ క్వారీకి డీడీ బిల్డర్స్‌కు ఆమె అనుమతినిచ్చారని పేర్కొన్నారు.

ఆ క్వారీలో బండరాళ్లు పడి ఇద్దరు జేసీబీ ఆపరేటర్లు మరణించారని గుర్తుచేశారు. వారి మృతదేహాలను వెలికితీయడానికి రూ.కోటిపైనే ఖర్చయిందని ఆయన వెల్లడించారు. ఆ ఖర్చును తహసీల్దార్‌ నుంచి వసూలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇద్దరి మరణానికి పరోక్షంగా కారణమైనా తహసీల్దార్‌ బాధ్యులని అందుచేత రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. డీడీ బిల్డర్స్‌కు ఏ నియమం ప్రకారం క్వారీ లీజుకు ఇచ్చారో తహసీల్దార్‌ జవాబు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే తహసీల్దార్‌ ద్వారా ప్రజలకు అందించిన బోగస్‌ పట్టాలపై విజిలెన్స్‌చే దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

నిరూపిస్తే శిక్షకు సిద్ధం: తహసీల్దార్‌

గవర్నర్‌ను ఉద్దేశించిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు కమ్యూనిస్ట్‌ పార్టీ శ్రేణులు అందజేశారు. వెంటనే ఆమె వినతిపత్రాన్ని చదివి జుధిష్టర్‌ రౌళోతో వాగ్వాదానికి దిగారు. తనపై చేసిన ఆరోపణలు అసత్యాలని తాను చట్టపరంగానే క్వారీలకు అనుమతినిచ్చానని తెలిపారు.

కలెక్టర్‌ గాని సబ్‌కలెక్టర్‌ గానీ క్వారీలకు అనుమతులు ఇవ్వవద్దని ఆదేశించలేదని, అటువంటి లేఖలు తనకు రాలేదని, మీవద్ద ఉంటే చూపించండని ఆమె సవాల్‌ చేశారు. తాను తప్పు చేశానని నిరూపిస్తే తగిన శిక్షకు సిద్ధమని స్పష్టంచేశారు.

వెంటనే రౌళో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేయడంతో ఆమె వెంటనే క్యాబిన్‌ లోపలికి వెళ్లిపోయింది. ఆందోళననలో పార్టీ నేతలు ఉత్తమ మల్లిక్, బలరాం నాయక్, కేశవ నాగ్, నంద హరిజన్, నిత్యానంద పాత్రో, హరి పంగి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు