అద్దె కార్లే అతడి టార్గెట్‌

2 Feb, 2018 16:55 IST|Sakshi
బెంగళూరు పోలీసుల అదుపులో దిలీప్‌కుమార్‌

సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కోసం తీసుకుని దొంగతనం

వాటిలోనే మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌

ఘరానా దొంగను పట్టుకున్న బెంగళూరు కాప్స్‌ 

హెదరాబాద్‌లోనూ నేరాలు చేసినట్లు అంగీకారం

ఆరా తీయనున్న సిటీ పోలీసులు

సాక్షి,సిటీబ్యూరో: తన ఇద్దరు అనుచరుల తో కలిసి టూరిస్ట్‌ మాదిరిగా వస్తాడు... నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కార్లు అద్దెకు తీసుకుంటాడు... వెంటనే రాష్ట్రం దాటేసి వాటి రూపురేఖలు మార్చేస్తాడు... ఈ వాహనాలను వినియోగించి కొన్నాళ్ళ పాటు గంజా యి స్మగ్లింగ్‌ చేసి ఆపై అమ్మేసి సొమ్ము చేసుకుంటాడు... ఈ పంథాలో నాలుగు రాష్ట్రాల్లో ‘పనితనం’ ప్రదర్శించిన అంతర్రాష్ట్ర దొంగను బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. ఇతడి ముఠా సిటీలోనూ నేరాలు చేసినట్లు వెలుగులోకి రావడంతో విషయం ఆరా తీయాలని ఇక్కడి అధికారులు నిర్ణయించారు.
 
జీపీఎస్‌ ఉన్న హైఎండ్‌ వాహనాలే..
రాజస్థాన్‌లోని జాలోర్‌ జిల్లాకు చెందిన దిలీప్‌కుమార్‌ అలియాస్‌ సురేంద్ర సింగ్‌ ఈ ముఠా నాయకుడిగా అదే ప్రాంతానికి చెందిన బల్వీర్, ముఖేష్‌లు సభ్యులుగా ఉన్నారు. ఈ ముగ్గురూ టూరిస్టుల మాదిరిగా దేశంలోని వివిధ నగరాలకు వెళ్తుంటారు. వెళ్ళే ముందే తమ ఫొటోలు, నకిలీ పేర్లు, చిరునామాలతో కూడిన గుర్తింపుకార్డులు తయారు చేసుకుని దగ్గర ఉంచుకుంటారు. ఎంపిక చేసుకున్న నగరానికి చేరుకున్న తర్వాత ట్రావెల్స్‌ కార్యాలయాల నుంచి కార్లను అద్దెకు తీసుకుంటారు.

తామే వాహనాలను డ్రైవ్‌ చేసుకుంటామంటూ వాటి యాజమాన్యాలతో చెప్తారు. ఈ గ్యాంగ్‌ ట్రావెల్స్‌ నిర్వాహకులకు ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరిస్తుంది. సాధారణ కార్లు కాకుండా జీపీఎస్‌ పరిజ్ఞానం జోడించిన హైఎండ్‌ వాహనాలే అద్దెకు కావాలని అడుగుతుంది. దీంతో వాటిని ఇవ్వడానికీ యజమానులు వెనుకాడరు. ఇలా తీసుకునే సమయంలో ఈ ముగ్గురూ తమ వెంట తెచ్చుకున్న నకిలీ గుర్తింపు పత్రాలు దాఖలు చేస్తుంటారు. ఇలా కారు తమ చేతికి చిక్కిన వెంటనే రాష్ట్రం దాటేయడంతో పాటు సరిహద్దుల్లోనే జీపీఎస్‌ పరికరాలు, కారు నెంబర్‌ ప్లేట్లను తొలగించేస్తారు. ఏ రాష్ట్రానికి వెళ్తున్నారో అదే సిరీస్‌లతో కూడిన నకిలీ రిజిస్ట్రేషన్‌ నెంబర్లు తగిలించుకుంటారు. ఇలా వాహనాలను తీసుకుని నేరుగా గుజరాత్‌ లేదా రాజస్థాన్‌ చేరుకుంటారు.
 
‘కళ్ళల్లో’ పడే వరకు స్మగ్లింగ్‌... 
ఈ చోరీ వాహనాలను వినియోగించే దిలీప్‌ గ్యాంగ్‌ ఆ రెండు రాష్ట్రాల్లోనూ గంజాయి స్మగ్లింగ్‌ చేస్తుంటుంది. పోలీసులకు తాము వినియోగిస్తున్న వాహనంపై అనుమానం వచ్చే వరకు అక్రమ రవాణా చేస్తుంది. అలా జరిగిందని తెలిసిన వెంటనే నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేసి ఆ వాహనాన్ని అమ్మేస్తుంది. ఆపై మరో నగరాన్ని టార్గెట్‌గా చేసుకుని ‘వచ్చి పోతుంది’. ఈ పంథాలో వీరు బెంగళూరులోని జయప్రకాష్‌ నగర్, జీవన్‌బీమా నగర్‌ల్లో ఉన్న జస్ట్‌ రైడర్, జూమ్‌ కార్‌ సంస్థల నుంచి రూ.40 లక్షల విలువైన రెండు హైఎండ్‌ కార్లను ఎత్తుకుపోవడంతో అక్కడ కేసులు నమోదయ్యాయి.

దీనిపై దర్యాప్తు చేపట్టిన బెంగళూరు పోలీసులు దిలీప్, బల్వీర్, ముఖేష్‌లు నిందితులుగా గుర్తించారు. వీరు రాజస్థాన్‌లో ఉన్నట్లు గుర్తించి సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు కార్లు స్వాధీనం చేసుకుని బెంగళూరు తరలించారు. విచారణ నేపథ్యంలో ఈ చోర త్రయం ఇదే పంథాలో ముంబై, చెన్నై, హైదరాబాద్‌ల్లోనే కార్ల చోరీలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ముగ్గురి అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని బెంగళూరు పోలీసులు ఈ మూడు ప్రాంతాలకు అందించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న అధికారులు ఇక్కడ నమోదైన ఈ తరహా నేరాలపై ఆరా తీస్తున్నారు. త్వరలో ఓ ప్రత్యేక బృందాన్ని బెంగళూరు పంపనున్నట్లు తెలిసింది.   

మరిన్ని వార్తలు