ఇసుక లారీల ఆగడాలపై విలేకరి ఆత్మహత్యాయత్నం

2 Jun, 2018 12:56 IST|Sakshi
నాగరాజుతో చర్చిస్తున్న సీఐ మధుసూదనరావు

రాజధాని ప్రాంతంలో కలకలం

పోలీసులు స్పందించటంతో తప్పిన ప్రమాదం

ఇసుక లారీలను అడ్డుకున్న యర్రబాలెం గ్రామస్తులు

తాడేపల్లి రూరల్‌/మంగళగిరి రూరల్‌: రాజధాని అమరావతిలో ఇసుక లారీల కారణంగా పలు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని శుక్రవారం ఓ విలేకరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఇసుక లారీల ఆగడాలను పోలీసులు పట్టించుకోవటం లేదంటూ ఓ పత్రికలో విలేకరిగా పనిచేస్తున్న నాయుడు నాగరాజు శరీరంపై పెట్రోలు పోసుకున్నాడు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పాత్రికేయుడిగా తాను ప్రాణాలు అర్పిస్తే అయినా ఇసుక లారీలను నిషేధిస్తారా? అని ప్రశ్నించాడు. ఇసుక లారీలను కృష్ణాయపాలెం, పెనుమాక, ఉండవల్లి మీదుగా పంపాలని మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన నాగరాజు డిమాండ్‌ చేశాడు. సమీపంలో ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై నాగరాజును కాపాడటంతో ప్రాణాపాయం తప్పింది. లారీలను నిషేధించడాన్ని ప్రజాప్రతినిధులే నిర్ణయించాలని త్వరలో వారితో చర్చలు నిర్వహిస్తామని సీఐ మధుసూదనరావు చెప్పారు. 

ప్రమాదం జరిగినప్పుడు హడావుడి...
మంగళగిరి నియోజకవర్గంలో ఇసుక లారీల జోరుపై నిత్యం ఏదో ఒకచోట  ఆందోళన జరుగుతూనే ఉంది. ఏదైనా ప్రమాదం జరగగానే పోలీసులు రెండు రోజులు నియంత్రించడం త ర్వాత లారీలు యథావిధిగా తిరగడం మామూలై పోయింది. ఇసుక లారీలతో ఇబ్బందులకు గురవుతున్న యర్రబాలెం ప్రజలు ఎన్నోసార్లు ధర్నాలు చేసినా పట్టించుకున్న అధికారులు లేరు. విలేకరి నాగరాజు అధికారులను కలిసి గ్రామస్తుల గోడు వినిపించినా ఫలితం దక్కలేదు. గ్రామస్తులు ధర్నా చేయటంతో చివరకు స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేసినా ఇసుక లారీల దూకుడుకు మాత్రం బ్రేకులు పడలేదు. గ్రామస్తులు శుక్రవారం మరోసారి ధర్నాకు దిగి లారీలను అడ్డుకున్నారు.

బైపాస్‌ రోడ్డుకు మరమ్మతులు చేస్తే...
వాస్తవానికి యర్రబాలెం నుంచి బైపాస్‌ రోడ్డు ఏర్పాటుచేశారు. సీఆర్‌డీఏ అధికారులు స్పందించి ఇసుక లారీలు వెళ్లే రహదారికి మరమ్మతులు చేసి బీటీ రోడ్డు నిర్మిస్తే దుమ్ము, ధూళి నివారించే అవకాశం ఉంది. యర్రబాలెం ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయి. యర్రబాలెం చెరువు నుంచి సినిమాహాల్‌ మీదుగా ట్రాఫిక్‌ను పంపించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు