ఆర్నెల్ల తర్వాత శవానికి పోస్టుమార్టం

30 Mar, 2018 10:18 IST|Sakshi
సీతారాంరెడ్డి మృతదేహాన్ని వెలికి తీస్తున్న దృశ్యం

సీతారాంరెడ్డి మృతదేహం వెలికితీత

శరీర భాగాలు తిరుపతి ల్యాబ్‌కు తరలింపు

కురబలకోట : ఆరు నెలల క్రితం మృతిచెందిన అంగళ్లుకు చెందిన శెట్టి సీతారాంరెడ్డి మృతదేహాన్ని గురువారం వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. శరీర భాగాలను తిరుపతిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపుతున్నట్లు ఇన్‌చార్జి రూరల్‌ సీఐ సురేష్‌కుమార్‌ వెల్లడించారు. ఆర్నెళ్ల తర్వాత కూడా మృత దేహం చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. వివరాల్లోకెళితే.. అంగళ్లుకు చెందిన సీతారాంరెడ్డి ఆరు నెలల క్రితం మృతిచెందారు. ఆయన గుండెపోటుతో మృతిచెంది నట్టు భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

మదనపల్లెలో ఇటీవల జరిగిన హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొంతమంది నిందితులను అరెస్టు చేశారు. విచారణలో వారు సీతారాంరెడ్డిని హత్య చేసినట్టు అంగీకరించారు. ఆస్తి పంపకాలకు అడ్డుపడుతున్నాడన్న కారణంతో అతన్ని బంధువులు పథకం ప్రకారం హత్య చేయించినట్టు వెల్లడించారు. ఊరి బయటకు వాకింగ్‌కు వెళ్లిన ఆయనకు బలవంతంగా విషపు నీరు తాగించడంతో చనిపోయినట్లు వివరించారు. పోలీసులు తహసీల్దార్‌ ఆధ్వర్యంలో గురువారం సీతారాంరెడ్డి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించారు. ఆయన శరీర భాగాలను తిరుపతి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. ఐదుగురు నిందితులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి నివేదిక అందిన తర్వాత దర్యాప్తు వేగవంతం చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు