ఆశ్రమ పాఠశాల విద్యార్థి హత్య 

24 Oct, 2018 03:39 IST|Sakshi
దేవత్‌ జోసఫ్‌

     తోటి విద్యార్థులే కొట్టి చంపారా? 

     పోలీసుల అదుపులో ఒకరు.. 

     ఖమ్మం గిరిజన వసతిగృహంలో ఘటన  

     విచారణ జరుపుతున్నాం: టూటౌన్‌ సీఐ

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి దారుణంగా హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన తీరు అత్యంత పాశవికంగా ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. తోటి విద్యార్థులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటన మంగళవారం ఖమ్మంలోని గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖానాపురానికి చెందిన దేవత్‌ జోసఫ్‌(10) ఖమ్మం నెహ్రూనగర్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్నాడు. సాయంత్రం 3.15 గంటల వరకు పాఠశాలలోనే ఉన్నాడు.

అయితే పక్కనే ఉన్న వసతి గృహానికి వెళ్లిన సదరు విద్యార్థి కొద్ది నిమిషాల్లోనే మృత్యువాత పడటం.. ఆ సమయంలో వసతి గృహంలో విద్యార్థులు పెద్దగా ఎవరూ లేకపోవడంతో ఈ హత్య ఏ రకంగా జరిగింది.. ఎవరు చేశారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జోసఫ్‌కు తగిలిన బలమైన గాయాలు, మృతదేహం పడి ఉన్న తీరును పరిశీలించిన పోలీసులు.. జోసఫ్‌తో ఎవరైనా ఘర్షణ పడి.. ఆ తర్వాత హత్య చేసి ఉంటారన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. పదేళ్ల బాలుడిని అత్యంత పాశవికంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని, దీని వెనకాల ఉన్న ఉన్మాదం ఏమిటన్న అంశం చర్చనీయాంశంగా మారింది.  

నేలకేసి కొట్టి చంపారా? 
జోసఫ్‌ శరీరంపై బలమైన గాయాలు ఉండటంతో అతడిని నేలకేసి బాది ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు హాస్టల్‌ వార్డెన్‌ ప్రతాప్‌సింగ్, సిబ్బందిని విచారించారు. సంఘటన జరిగిన కొద్ది సేపటికే అదే వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఒకరు కంగారు పడుతూ వసతి గృహం ఆవరణ నుంచి బయటకు వెళ్లాడని, ఎక్కడికి వెళ్తున్నావని తాను అడిగితే స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయాడని వార్డెన్‌ పోలీసులకు వివరించారు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

జోసఫ్‌ మృతదేహంపై బలమైన గాయాలు ఉండటంతో అతనితో ఘర్షణకు దిగిన వారే అనంతరం హత్య చేసి ఉంటారని టూ టౌన్‌ సీఐ నరేందర్‌ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని చెప్పారు. సీసీ పుటేజీలకు పరిశీలించిన ఏసీపీ వెంకట్రావు, టౌటౌన్‌ సీఐ నరేందర్‌.. మృతుడు జోసఫ్‌తో మరో విద్యార్థి కలిసి తిరిగినట్లుగా ఉన్న పుటేజీని గుర్తించారు. జోసఫ్‌ తల్లి మూగ మహిళ కాగా.. తండ్రి రెక్కాడితే డొక్కాడని దినసరి కూలీ కావడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. కాగా, బాలుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కొడుకు చనిపోవడానికి వసతి గృహం అధికారుల బాధ్యతా రాహిత్యమే కారణమంటూ ఆందోళనకు దిగారు.  

మరిన్ని వార్తలు